చిలీ కార్చిచ్చులో 46 మంది మృతి.. 1100 ఇండ్లు ఆహుతి

చిలీ కార్చిచ్చులో 46 మంది మృతి.. 1100 ఇండ్లు ఆహుతి
  • మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్న ఫైర్ ఫైటర్లు

వినా డెల్ మార్ : సెంట్రల్  చిలీలోని వాల్సారైసోలో కొనసాగుతున్న భీకర కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 46 మంది చనిపోయారు. 1100 ఇండ్లు, వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎక్కడ చూసినా బూడిద కుప్పలే దర్శనమిస్తున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్  ఫైటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి అధ్యక్షుడు గాబ్రియెల్  బోరిక్  టీవీలో మాట్లాడారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని ఆయన చెప్పారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ ఫైటర్లు, అధికారులకు సహకరించాలని కోరారు. ఇండ్లు ఖాళీ చేయాలని చెబితే వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. 

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, గాలులు, తేమ  కారణంగా కార్చిచ్చు మరింత వేగంగా విస్తరిస్తున్నది. సెంట్రల్, దక్షిణ చిలీలో 92 చోట్ల మంటలు వ్యాపించాయి.  వాల్పారా ప్రాంతంలో మంటలు భీకరంగా కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలో కొన్నివేల మందిని ఖాళీ చేయించాం. మంటలు ఆర్పేందుకు వెళ్తున్న ఫైరింజన్లకు దారివ్వండి. కిల్పు, విల్లా ఆలెమానా పట్టణాల్లో 19,770 ఎకరాలు అగ్నికీలలకు బూడిదయ్యాయి. అలాగే పలు ఇండ్లు, వాహనాలు, వ్యాపార కేంద్రాలు నాశనమయ్యాయి” అని బోరిక్  తెలిపారు. కాగా, ఈ ఏడాది దక్షిణ అమెరికాలో ఎల్ నినో కారణంగా కరువు సంభవించింది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా పెరిగాయి.అలాగే  డ్రై వెదర్ వల్ల కొలంబియాలో గత నెలలో సంభవించిన కార్చిచ్చు ధాటికి 42 వేల ఎకరాలు ఆహుతయ్యాయి.