ఈ దరిద్రం ఏంటి సామీ : ఆరు రాష్ట్రాలకు చైనా వైరస్ అలర్ట్

ఈ దరిద్రం ఏంటి సామీ : ఆరు రాష్ట్రాలకు చైనా వైరస్ అలర్ట్

చైనాలో కొత్తరకం న్యూమోనియా బారినపడి పిల్లలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు గతవారం  డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ సహా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.  ఈ క్రమంలో  దేశంలోని ఆరు రాష్ట్రాలకు కేంద్రం  అలర్ట్ జారీ చేసింది. ఇందులో రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.  వైద్య సదుపాయాల సంసిద్ధతను సమీక్షించాలని ఆయా రాష్ట్రాలకు  కేంద్రం సూచించింది. 

కేంద్రం హెచ్చరికలతో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు శ్వాసకోశ సమస్యలపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి సిద్ధంగా ఉండాలని ఆస్పత్రులు, వైద్య సిబ్బందిని ఆదేశించాయి.   ముఖ్యంగా కోవిడ్ సమయంలో చేపట్టిన చర్యల తరహాలో ఏర్పాట్లు ఉండాలని అదేశించాయి.  సీజనల్‌గా వచ్చే ఫ్లూ వంటి వ్యాధుల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ పేర్కొంది. అలాగే కాలానుగుణంగా ఈ వ్యాధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే గైడ్‌లైన్స్‌లు కూడా వారికి అందించాలని పేర్కొంది.

సీజనల్‌ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ఆరోగ్యశాఖ ఆదేశించింది.  తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు నోటిని, ముక్కును కవర్‌ చేసుకోవాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించింది. రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని పేర్కొంది. పదే పదే చేతులతో ముఖాన్ని తాకవద్దని తెలిపింది. ఇక ప్రస్తుతం తమ   రాష్ట్రంలో ఆందోళ పడాల్సిన అవసరం లేదని రాజస్థాన్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. కానీ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపడుతామని చెప్పింది.  

ఉత్తరాఖండ్‌లోని చమోలి, ఉత్తర్‌కాశీ, పిఠోర్‌గఢ్‌ జిల్లాలు చైనా సరిహద్దులో ఉంటాయి కాబట్టి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. హర్యానా రాష్ట్రం ప్రభుత్వం ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులను అయితే శ్వాసకోస సమస్యకు సంబంధించిన కేసు వస్తే వెంటనే నివేదించాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. తమిళనాడు,గుజరాత్  ఆరోగ్య శాఖ కూడా ఇదే విధమైన ఆదేశాలను జారీ చేసింది.