మహబూబ్ నగర్ లో ఏటీఎంను లేపేసిన్రు...గ్యాస్ కట్టర్లతో పెకిలించి అపహరించిన దుండగులు

మహబూబ్ నగర్ లో ఏటీఎంను లేపేసిన్రు...గ్యాస్ కట్టర్లతో పెకిలించి అపహరించిన దుండగులు

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, వెలుగు: మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ పట్టణంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టణ నడిబొడ్డున తెలంగాణ చౌరస్తాలో ఉన్న ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ ఏటీఎం సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఏకంగా ఏటీఎం మిషన్‌‌‌‌‌‌‌‌ను ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఏటీఎం వద్దకు వచ్చిన దుండగులు ముందుగా అద్దాలు పగలగొట్టి, గ్యాస్ వెల్డింగ్ కట్టర్లు, ఇనుప రాడ్లతో ఏటీఎం మిషన్‌‌‌‌‌‌‌‌ను పెకిలించి బొలెరో వాహనంలో తీసుకెళ్లారు. 

ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జిల్లా ఎస్పీ జానకి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌‌‌‌‌‌‌‌ను రంగంలోకి దించారు. ఈ దొంగతనం మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దుండగులు ఎత్తుకెళ్లిన మిషన్​ను కొత్తపేట, టంకర శివారు ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. 

గ్యాస్ కట్టర్‌‌‌‌‌‌‌‌తో మిషన్‌‌‌‌‌‌‌‌ను కోసి అందులోని నగదును దోచుకెళ్లినట్లు గుర్తించారు. ఏటీఎంలో చోరీకి ముందు రోజు రూ.4 లక్షలకు పైగా నగదు డిపాజిట్ చేసినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. దొంగతనం జరిగే సమయానికి అందులో సుమారు రూ.1.5 లక్షల నగదు ఉన్నట్లు వెల్లడించారు. దుండగుల కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు.