
జనగామ, వెలుగు: జనగామ జిల్లా కేంద్రంలోని అభయాంజనేయ స్వామి గుడిలో దళితుడికి పూజలు చేసేందుకు ఆలయ పూజారి నిరాకరించారు. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గుడి పూజారి గంగు ఆంజనేయ శర్మను అరెస్ట్ చేశారు. దళిత వర్గానికి చెందిన లక్కపెల్లి భాస్కర్, సంధ్యారాణి దంపతులు తమ కుమారుడికి జ్ఞాన దంతం వచ్చిందని, శాంతి పూజ చేయించాలని శుక్రవారం స్థానిక ఆంజనేయ స్వామి గుడికి వెళ్లారు. పూజ చేయాలని కోరగా.. వారు దళిత వర్గానికి చెందినవారని తెలుసుకున్న పూజారి.. తాను దళితులకు పూజలు చేయనని, బయటికి వెళ్లాలని చెప్పడంతో ఆ దంపతులు వెనక్కి వెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న దళిత సంఘాలు గుడి దగ్గరికి వచ్చి పూజ చేయాలని శర్మను కోరగా అందుకు ఒప్పుకోలేదు. దీంతో దళిత సంఘాల నాయకులు గుడి ముందు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ మల్లేశ్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులను శాంతింప జేశారు. ఆందోళన సమయంలో పూజారి భార్య కూడా తమను కులం పేరిట దూషించారని ఆమెపైనా చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పూజారి గంగు ఆంజనేయ శర్మతో పాటు ఆయన భార్య అనితను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పూజారి, అతని భార్యపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.