తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన్రని బీజేపీ కార్యకర్తలపై దాడి

తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన్రని బీజేపీ కార్యకర్తలపై దాడి
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఘటన
  • ఇద్దరు బీజేపీ లీడర్లకు గాయాలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సోషల్ మీడియా పోస్టులు రెండు పార్టీల మధ్య వివాదానికి దారితీశాయి. అధికార పార్టీ నేతలు పోలీస్ స్టేషన్‌లోనే బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన బోనాల సాయి కుమార్ చాలా రోజులుగా కేరళలో ఉంటున్నాడు. సోషల్ మీడియాలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా అక్కడి నుంచి పోస్టులు పెడుతున్నాడు. దీంతో టీఆర్ఎస్ యువజన విభాగం కార్యకర్తలు అతడి ఇంటికి వెళ్లారు. సాయి తల్లి మణెవ్వతో గొడవపడ్డారు. ఆమెపై దాడికి ప్రయత్నించారు. దీంతో టీఆర్ఎస్ లీడర్లపై ఫిర్యాదు చేసేందుకు స్థానిక బీజేపీ కార్యకర్తలు ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. విషయం తెలుసుకున్న 100 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని.. బీజేపీ కార్యకర్తల ఫోన్లు లాక్కొని దాడికి దిగారు. ఈ ఘటనలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు రేపాక రామచంద్రం, బీజేవైఎం నాయకుడు ఏలేందర్‌‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరినీ ట్రీట్‌మెంట్ కోసం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. టీఆర్ఎస్ లీడర్లు దాడి చేసిన సమయంలో సీఐ, ఎస్ఐలు, సిబ్బంది.. గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో బందోబస్తుకు వెళ్లారు. కేవలం ముగ్గురు పోలీసులు మాత్రమే స్టేషన్‌లో ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపు చేయలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత వచ్చిన సీఐ, ఎస్‌ఐ.. టీఆర్ఎస్, బీజేపీ లీడర్లను పంపించేశారు. ఇసుక అక్రమ రవాణా మీద మాట్లాడుతున్నానన్న కారణంతో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య దాడి చేయించాడని రేపాక రామచంద్రం ఆరోపించారు. వారం రోజులుగా టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫేస్‌బుక్ పంచాయతీలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ముందస్తు చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

స్టేషన్ ఎదుట బీజేపీ నాయకుల ఆందోళన
తమ పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నేతల దాడిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు దాదాపు మూడు గంటలపాటు ఎల్లారెడ్డిపేట ​స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాయి. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కటకం మృత్యుంజయం అక్కడికి చేరుకొని.. టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేయాలని, స్టేషన్ లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్​చేశారు. ఈ సమయంలో మృత్యుంజయం, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తర్వాత 200 మందికి పైగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎల్లారెడ్డిపేట టీఆర్ఎస్​అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటి వద్ద ఆందోళన నిర్వహించేందుకు వెళ్లారు. పోలీసులు అక్కడికి వచ్చి బీజేపీ శ్రేణులపై లాఠీచార్జ్ చేశారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ జిల్లా కార్యదర్శి రెడ్డవేణ గోపి మాట్లాడుతూ.. తోట ఆగయ్య సుమారు 200 మందితో కలిసి తమపై దాడికి దిగారని ఆరోపించారు.