హైదరాబాద్ జగద్గిరి గుట్టలో దారుణం: ఒకలు దొర్కవడితే.. ఇంకొకలు పొడిచిన్రు

హైదరాబాద్ జగద్గిరి గుట్టలో దారుణం: ఒకలు దొర్కవడితే.. ఇంకొకలు పొడిచిన్రు
  • పది పోట్లు పొడవడంతో దవాఖానలో చేరిన బాధితుడు
  • చికిత్స పొందుతూ మృతి
  • జగద్గిరిగుట్ట బస్టాప్​లో సాయంత్రం ఘటన  

జీడిమెట్ల, వెలుగు : ఇద్దరు రౌడీషీటర్ల మధ్య పాతకక్షలు కత్తిపోట్లకు దారి తీసింది. అది కూడా అందరూ చూస్తుండగా ఒకరు పట్టుకుంటే..మరొకరు కత్తితో ఆరేడు సార్లు పొడిచాడు. ఈ ఘటన జగద్గిరిగుట్ట బస్టాప్​లో సాయంత్రం వేళ వందలాది మంది చూస్తుండగా జరిగింది. జగద్గిరిగుట్ట సోమయ్యనగర్​కు చెందిన బాలాషౌరెడ్డి(25), రంగారెడ్డినగర్​కి చెందిన రోషన్​సింగ్​(23) రౌడీషీటర్లు. బుధవారం సాయంత్రం  4.20 గంటలకు రౌడీషీటర్ ​రోషన్​సింగ్ జగద్గిరిగుట్ట బ​స్టాప్ ​వద్ద ఫ్రెండ్​తో మాట్లాడుతున్నాడు. అదే టైంలో అక్కడికి మరో రౌడీషీటర్​ బాలషౌరెడ్డి, అతడి ఫ్రెండ్​ఆదిల్​వచ్చారు. 

ఇద్దరూ కలిసి ఏదో విషయంలో రోషన్​సింగ్​తో గొడవకు దిగారు. ఈ క్రమంలో బాలషౌరెడ్డి మరో మిత్రుడు మహ్మద్​అక్కడికి వచ్చాడు. దీంతో బాలషౌరెడ్డి, ఆదిల్, మహ్మద్...రోషన్​సింగ్​మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో బాలషౌరెడ్డి తన వద్ద ఉన్న కత్తి బయటకు తీశాడు. మహ్మద్...రోషన్​సింగ్​ను పట్టుకోగా బాలషౌరెడ్డి కత్తితో అందరూ చూస్తుండగా విచక్షణారహితంగా కత్తితో పొడవడం మొదలుపెట్టాడు. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు అరుపులు, కేకలు పెట్టుకుంటూ పరుగులు తీశారు. 

సుమారు పది వరకు కత్తి పోట్లు పొడవగా రోషన్​సింగ్​రక్తమోడుతూ అక్కడే పడిపోయాడు. తర్వాత బాలషౌరెడ్డి, ఆదిల్​, మహ్మద్​ బైక్​పై పారిపోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రోషన్​సింగ్​ను స్థానికంగా ఉన్న దవాఖానకు, అక్కడి నుంచి గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు. పాతకక్షలే హత్యాయత్నానికి కారణంగా భావిస్తున్నారు.  నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మేడ్చల్​ డీసీపీ కోటిరెడ్డి ప్రకటించారు.