ఎస్ఐని సస్పెండ్ చేసి, అట్రాసిటీ కేసు పెట్టాలె

ఎస్ఐని సస్పెండ్ చేసి, అట్రాసిటీ కేసు పెట్టాలె
  •     ప్రజా సంఘాలు,వివిధ పార్టీల నేతల మండిపాటు
  •     బాధితురాలిని పరామర్శించిన మాజీ ఎంపీ మధుయాష్కీ, కాంగ్రెస్ నేతలు

ఎల్​బీ నగర్, వెలుగు :  గిరిజన మహిళ వడ్త్యా లక్ష్మిపై దాడికి కారకుడైన ఎస్సై రవికుమార్​ను వెంటనే సస్పెండ్ చేసి, అతనిపై అట్రాసిటీ కేసు పెట్టాలని కాంగ్రెస్  ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ డిమాండ్ ​చేశారు. బాధితురాలికి  డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆమె కూతురికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పేర్కొన్నారు. కర్మన్​ఘాట్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో లక్ష్మి చికిత్స పొందుతుండగా.. శుక్రవారం మధుయాష్కీతో పాటు కాంగ్రెస్ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, ఎల్​బీ నగర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెళ్లి పరామర్శించారు. 

అనంతరం మధుయాష్కీ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున అర్ధరాత్రి గిరిజన మహిళను అకారణంగా నిర్బంధించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల దుర్మార్గపు ఘటనను కాంగ్రెస్ ఖండిస్తుందన్నారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

స్టేషన్ వద్ద ఆకునూరి మురళి నిరసన

గిరిజన మహిళపై పోలీసుల దాడి దారుణమని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసుల తీరును తప్పుబడుతూ.. ఎల్​బీనగర్ పీఎస్ వద్ద ఆయన నిరసన తెలిపి మాట్లాడారు. అమాయకులపై పోలీసుల ప్రతాపం ఏంటని ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన మహిళపై దాడికి పాల్పడిన పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 
బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పలు ప్రజా సంఘాల నేతలు, వివిధ పార్టీల నేతలు అసహనం వ్యక్తంచేశారు. 

బీఎస్పీ, డీఎస్పీ నేతల ఆందోళన

మహిళను  తీవ్రంగా కొట్టిన ఎస్సై రవికుమార్​తో పాటు బాధ్యులైన పోలీసులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నేత జక్క యాదగిరి డిమాండ్ చేశారు. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్​ను సస్పెండ్ చేసి.. ఎస్సైని తప్పించడమేంటని ప్రశ్నించారు. గిరిజన మహిళపై దాడికి పాల్పడిన ఎస్సైతో పాటు సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ నేతలు ఎల్ బీనగర్​లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు.