స్నేహితుడి కోసం వెళ్తే దాడి.. దబీర్పురా జెఫ్టో ఆఫీసు దగ్గర ఘటన..ముగ్గురిపై కేసు నమోదు

స్నేహితుడి కోసం వెళ్తే దాడి.. దబీర్పురా జెఫ్టో ఆఫీసు దగ్గర ఘటన..ముగ్గురిపై కేసు నమోదు

డబీర్‌‌‌‌పురా, వెలుగు : దబీర్‌‌‌‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో స్నేహితుడిని కాపాడడానికి వెళ్లిన ఓ మైనర్ పై పలువురు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ కేసులో డబీర్​పురా పోలీసులు ముగ్గురు నిందితులతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. మే 26 రాత్రి 8 గంటలకు చంచల్​గూడకు చెందిన యాసీర్ అలీ ఖాన్ (17) కు అతడి స్నేహితుడు అర్సలాన్ ఫోన్​చేశాడు. 

తాను జెప్టో డెలివరీ సర్వీసెస్‌‌‌‌లో పనిచేస్తున్నానని, డబీర్‌‌‌‌పురా బ్రిడ్జి దగ్గర ఉన్న జెప్టో ఆఫీసు ఆర్డర్ డెలివరీ కోసం వెళ్లినప్పుడు అక్కడ మేనేజర్‌‌‌‌తో గొడవ జరిగిందని, తనను కాపాడాలని అర్సలాన్ కోరాడు. స్నేహితుడి పిలుపుతో యాసీర్ అలీ ఖాన్ అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ సుమారు 10 మంది గుమిగూడి ఉన్నారు. యాసీర్ సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా, అక్కడున్న వారు అతనిపై దాడికి దిగారు. భయపడిన అర్సలాన్ అక్కడి నుంచి పారిపోయాడు. 

నిందితుల నుంచి తప్పించుకోవడానికి యాసీర్ రోషన్ డెయిరీ ఫామ్ వైపు పరుగెత్తాడు. కానీ, అతనిని వెంబడించి, డెయిరీ ఫామ్ వద్ద అడ్డుకుని ముగ్గురు యాసీర్‌‌‌‌ను తీవ్రంగా కొట్టారు. దాడిలో యాసీర్ రెండు చెవులు, తల వెనుక భాగం, మెడ, ఎడమ భుజం, కుడి వైపు పక్కటెముకల వద్ద తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన వారిని రహ్మత్, సంజయ్, ముర్తుజాగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పి.ఉపాశంకర్​తెలిపారు.