ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ‎పై దాడికి యత్నం.. తప్పిన ప్రమాదం

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ‎పై దాడికి యత్నం..  తప్పిన ప్రమాదం

ఢిల్లీ: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‎పై ఓ యువకుడు దాడికి యత్నించాడు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో కేజ్రీవాల్ పాదయాత్ర నిర్వహిస్తు్న్నాడు. ఈ క్రమంలో అనుహ్యంగా పాదయాత్రలోకి దూసుకొచ్చిన యువకుడు తన చేతిలో ఉన్న లిక్విడ్‎ను కేజ్రీవాల్‎పై విసిరేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన కేజ్రీవాల్ సెక్యూరిటీ సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ పై దాడికి యత్నించిన యువకుడిని పోలీసులకు అప్పగించారు. 

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దాడి వెనుక గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో కేజ్రీవాల్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆప్ కార్యకర్తలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఆప్ తీవ్రంగా స్పందించింది. కేజ్రీవాల్ కు తగిన భద్రతా కల్పించకుండా.. ఆయనను అంతమొందించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేసింది ఆప్. 

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్.. 2024 అక్టోబర్ నెలలో బెయిల్ పై జైలు నుండి బయటికొచ్చిన విషయం తెలిసిందే. తనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. 2025లో జరిగే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచి.. ప్రజలు తనకు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాకే మళ్లీ సీఎం పగ్గాలు చేపడతానని శపథం చేశారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేజ్రీవాల్ పాదయాత్ర మొదలుపెట్టారు.