కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు

కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు
  • పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకునే యత్నం
  • తన ఫిర్యాదును పట్టించుకోలేదనే..

గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని వన్‌‌‌‌ టౌన్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ పరిధిలోని మున్సిఫ్ కోర్టు ఆవరణలో మేకల పోషం అనే వ్యక్తి మంగళవారం ఒంటిపై పెట్రోల్‌‌‌‌ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాజీవ్‌‌‌‌ నగర్‌‌‌‌కు చెందిన మేకల పోషంకు, అదే కాలనీకి చెందిన ఎంచర్ల మహేశ్‌‌‌‌కు మధ్య కొంతకాలంగా పాతకక్షలున్నాయి. ఎన్నికల సందర్భంగా ఈ నెల 3వ తేదీన డీజే సౌండ్‌‌‌‌ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. దీనిపై మేకల పోషం గోదావరిఖని వన్‌‌‌‌టౌన్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేయగా మహేశ్‌‌‌‌పై కేసు నమోదు చేయలేదు.

అయితే, మహేశ్‌‌‌‌ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు పోషం, అతడి కుటుంబ సభ్యులపై మాత్రం కేసు పెట్టారు. మంగళవారం గోదావరిఖని కోర్టుకు వచ్చిన పోషం కోర్టు ఆవరణలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌‌‌‌ను ఒంటిపై పోసుకున్నాడు. ఐ వాంట్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అంటూ నినాదాలు చేస్తూ జేబులో ఉన్న అగ్గిపెట్టెను తీసే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే గోదావరిఖని గవర్నమెంట్‌‌‌‌ జనరల్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. కాగా, సాయంత్రం పోషం ఫిర్యాదు మేరకు ఎంచర్ల మహేశ్‌‌‌‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.