సీజేఐపై షూతో దాడికి యత్నం.. అడ్డుకున్న సెక్యూరిటీ.. ప్రొసిడీంగ్స్ టైమ్లో ఘటన

సీజేఐపై షూతో దాడికి యత్నం.. అడ్డుకున్న సెక్యూరిటీ.. ప్రొసిడీంగ్స్ టైమ్లో ఘటన
  • సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఊరుకోబోమని నినాదాలు
  • నిందితుడిని అడ్వకేట్ రాకేశ్ కిశోర్​గా గుర్తింపు
  • కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేసిన బార్ అసోసియేషన్
  • దేశంలో ఏ కోర్టులోనూ వాదించకుండా ఆంక్షలు
  • ఇలాంటి చర్యలు నన్నేం చేయబోవు: సీజేఐ బీఆర్ గవాయ్
  • ఘటనను ఖండించిన ప్రధాని మోదీ, ఖర్గే, సీఎం రేవంత్​రెడ్డి
  • ప్రొసిడింగ్స్ కొనసాగుతుండగా ఘటన
  • నిందితుడిని రాకేశ్ కిశోర్​గా గుర్తింపు

న్యూఢిల్లీ: కోర్టు ప్రొసీడింగ్స్ కొనసాగుతున్న సమయంలోనే ఓ సీనియర్ అడ్వకేట్.. సుప్రీం కోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్​పై దాడికి యత్నించాడు. తన షూ తీసి సీజేఐపై వేయడానికి ప్రయత్నిస్తుండగా.. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, తోటి లాయర్లు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఆ తర్వాత అతన్ని కోర్టు రూమ్ నుంచి బయటికి తీసుకెళ్లిపోయారు. 

‘‘సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం సహించబోదు’’ అంటూ సదరు అడ్వకేట్ నినాదాలు చేశాడు. దాడికి యత్నించిన లాయర్​ను ఢిల్లీలోని మయూర్ విహార్​లో నివాసం ఉండే 71 ఏండ్ల రాకేశ్ కిశోర్​గా గుర్తించారు. దాడి సమయంలో సీజేఐ పక్కన జస్టిస్ కే.వినోద్ చంద్రన్ కూడా ఉన్నారు. ఈ ఘటనపై జస్టిస్ బీఆర్ గవాయ్ వెంటనే స్పందించారు. 

‘‘ఇలాంటి చర్యలు నన్నేం చేయబోవు. వాదనలు కొనసాగించాలి’’ అని కేసు వాదిస్తున్న లాయర్లకు సూచించారు. కాగా, ఇటీవల మధ్యప్రదేశ్‌‌‌‌లోని ఖజురహో ఆలయ కాంప్లెక్స్​లోని జవారీ ఆలయంలో ధ్వంసమైన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్​ను సీజేఐ జస్టిస్ గవాయ్‌‌‌‌ కొట్టేశారు. అయితే, తీర్పు సమయంలో ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాకేశ్ కిశోర్ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

అసలేం జరిగింది?

సుప్రీం కోర్టులోని కోర్టు నంబర్ 1లో సుమారు ఉదయం 11:35 గంటల టైమ్ లో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే.వినోద్ చంద్రన్‌‌‌‌ బెంచ్‌‌‌‌లో ఉన్నారు. కేసులు మెన్షన్ చేసే సమయంలో రాకేశ్ కిశోర్ లేచి.. బెంచ్ వైపు వెళ్లాడు. తన షూ తీసి జస్టిస్ గవాయ్ వైపు విసిరే ప్రయత్నం చేశాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ అతన్ని అడ్డుకుని కోర్టు రూమ్ నుంచి బయటికి తీసుకెళ్లిపోయారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల కోసం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్​ను సంప్రదించారు.

బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్

నిందితుడు కిశోర్.. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్నాడు. దాడి తర్వాత అతన్ని బార్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. దేశంలోని ఏ కోర్టులో కూడా వాదించకుండా ఆంక్షలు విధించింది. షోకాజ్ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అన్ని కోర్టులు, ట్రిబ్యునల్​కు సస్పెండ్ విషయాన్ని తెలియజేయాలని సూచించింది.

సీజేఐ చేసిన వివాదాస్పద కామెంట్లేంటి?

ఖజురహో ఆలయ కాంప్లెక్స్​లోని జవారీ ఆలయంలో ధ్వంసమైన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలు చేసిన పిటిషన్​ను సీజేఐ బీఆర్​గవాయ్ సెప్టెంబర్ 17న విచారించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కామెంట్లు చేశారు. ‘‘ఇది పబ్లిసిటీ ఇంట్రెస్ట్ పిటిషన్. దీనిపై ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్ వాళ్లనే అభ్యర్థించండి. లేదంటే మీరెలాగూ విష్ణుమూర్తి పరమభక్తుడిని అని చెబుతున్నారుగా. ఆయననే వేడుకోండి. శైవత్వంపై  వ్యతిరేకత లేకుంటే అదే ఖజురహోలోని అతిపెద్ద శివలింగానికి కూడా మీరు విన్నవించుకోవచ్చు’’ అని సీజేఐ బీఆర్‌‌‌‌ గవాయ్‌‌‌‌ అన్నారు.

ఖండించిన ప్రముఖులు

సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్​పై జరిగిన దాడి ప్రయత్నాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఖండించారు. ఇది న్యాయ వ్యవస్థ, రాజ్యాంగంపై దాడి అని తెలిపారు. కేరళ సీఎం పినరయి విజయన్, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం ఎంకే.స్టాలిన్ దాడిని ఖండించారు. నిందితుడిని చట్టప్రకారం శిక్షించాలని కోరారు. దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఇది న్యాయవ్యవస్థపై దాడి అని సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ తెలిపారు.