‘గో ఎలక్ట్రిక్​’లో ఆటమ్​ ఎట్రాక్షన్

‘గో ఎలక్ట్రిక్​’లో ఆటమ్​ ఎట్రాక్షన్


హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ‘గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్’ ఎగ్జిబిషన్​లో ‘ఆటమ్​’ ఎలక్ట్రిక్​ బైకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎగ్జిబిషన్​కు వచ్చినోళ్లు ఆ బైకుల గురించి తెలుసుకున్నారు. కొందరు బండిపై రైడ్​కెళ్లారు. ఆదివారం హైదరాబాద్​లోని పీపుల్స్ ప్లాజాలో ఎగ్జిబిషన్​ను ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్​ రంజన్,  ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, టీఎస్ రెడ్కో చైర్మన్ సయ్యద్ అబ్దుల్ అలీం ప్రారంభించారు. గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్​లో భాగంగా పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ లోని అంబేద్కర్ నగర్ వరకు ఎలక్ట్రిక్ వాహనాల ర్యాలీని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని జయేశ్​ రంజన్ అన్నారు. వీటి కోసం ప్రత్యేక పాలసీని రూపొందించామన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ వినియోగంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని రెడ్కో ఎండీ జానయ్య, ఈఎస్సీఐ డైరెక్టర్ రామేశ్వర్​రావు అన్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరిన్ని ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందని, పర్యావరణానికి మేలు చేసే ఇంధన వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యూరో ఆఫ్ ఎలక్ట్రికల్ ఎఫీషియెన్సీ, టీఎస్ రెడ్కో, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ) ఆధ్వర్యంలో జరిగిన ఎగ్జిబిషన్ లో 40 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ కంపెనీల ఎలక్ట్రిక్ బైకులు, కార్లు, ఆటోలను ప్రదర్శించారు. 

ఆటమ్​.. ఒక్కసారి చార్జింగ్ ​పెడితే 150 కిలోమీటర్లు

ఆట మొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన ఆటమ్​ ఎలక్ట్రిక్ బైకులు ఎగ్జిబిషన్​లో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పొర్టబుల్ లిథియం బ్యాటరీలతో రూపొందించిన ఆ బైకులు ఆకట్టుకున్నాయి. 25 కిలోమీటర్ల వేగంతో 150 కిలోమీటర్ల రేంజ్​లో జర్నీ చేసే వీలుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అందుబాటు ధరల్లో ఆధునిక ఫీచర్లతో వీటిని మార్కెట్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. హైదరాబాద్ లాంటి సిటీల్లో తక్కువ నిర్వహణతో ఎక్కువ రేంజ్(మైలేజీ)తో ప్రయాణించడానికి వీలవుతుందన్నారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 నుంచి 150 కిలోమీటర్ల పవర్ బ్యాకప్​తో జర్నీ చేయవచ్చని చెప్పారు. రూ.7 ఖర్చుతోనే మ్యాగ్జిమమ్ రేంజ్ సిటీ రోడ్లపై దూసుకుపోవచ్చని తెలిపారు. బ్యాటరీలపై వారంటీ కూడా ఉంటుందన్నారు.