టోకెన్ అమౌంట్ కడితే లాటరీ తీసి ఫ్లాట్ కేటాయిస్తాం

టోకెన్ అమౌంట్ కడితే లాటరీ తీసి ఫ్లాట్ కేటాయిస్తాం

హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీలో ఫ్లాట్ వచ్చినా కొందరు టోకెన్ అమౌంట్ కట్టకపోవడంతో ఆ ఫ్లాట్లను తీసుకునేందుకు మిగతా వాళ్లకు చాన్స్ ఇవ్వాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ ఫ్లాట్లకు అప్లై చేసుకుని, ఫ్లాట్ దక్కని వాళ్లు టోకెన్ అమౌంట్ కట్టేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు గురువారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 26 కల్లా అప్లై చేసుకున్న ఫ్లాట్ కు టోకెన్ అమౌంట్ కడితే లాటరీ తీసి ఫ్లాట్ కేటాయిస్తామని వెల్లడించారు. త్రిబుల్ బెడ్ రూమ్ డీలక్స్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కు రూ.3 లక్షలు, డబుల్ బెడ్ రూమ్ కు రూ.2 లక్షలు, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కు రూ.లక్షను హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ పేరుతో డీడీ తీసి, హిమాయత్ నగర్ లోని రాజీవ్ స్వగృహ ఎండీ ఆఫీసులో గడువులోపు అందజేయాలని అధికారులు సూచించారు.  

లాటరీదారుల నుంచి నో రెస్పాన్స్ 

బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్లకు 39 వేల అప్లికేషన్లు రాగా అధికారులు లాటరీ తీసి 3,716 మందికి ఫ్లాట్లు కేటాయించారు. వీరిలో 80 శాతం మంది మాత్రమే  ప్రభుత్వం ఖరారు చేసిన టోకెన్ అమౌంట్ కట్టారు. అమౌంట్ కట్టడానికి అధికారులు మూడు సార్లు గడువు పొడిగించినా లాటరీదారుల నుంచి స్పందన రాలేదు. బ్యాంకు లోన్లు, పార్కింగ్, ఫ్లాట్లు క్వాలిటీగా లేకపోవటం, నీటి బకాయిలు వంటి ఇతర సమస్యల కారణంగా టోకెన్ అమౌంట్ కట్టలేదని తెలుస్తోంది. దీంతో డబ్బులు కట్టని ఫ్లాట్లను ఇతర అప్లికెంట్లకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గడువులోపు పైసలు కట్టిన వారికి లాటరీ తీసి ఫ్లాట్లను కేటాయించనున్నారు. లాటరీలో ఫ్లాట్ రాని వాళ్లకు టోకెన్ అమౌంట్ తిరిగి ఇవ్వనున్నారు.