అడ్డంగా దొరికిన అత్తాకోడళ్లు..

అడ్డంగా దొరికిన అత్తాకోడళ్లు..
  • కృష్ణా జిల్లా కంకిపాడులో ఘటన

విజయవాడ: వారిద్దరూ స్వయానా అత్తా కోడళ్లు. గ్రహచారమో.. పరిస్థితుల ప్రభావమో తెలియదుగాని చోరీలు చేయడం ప్రారంభించారు. పలుమార్లు పోలీసులకు పట్టుబడినా.. చివరకు జైలుకు వెళ్లొచ్చినా.. పద్ధతి మాత్రం మార్చుకోవడం లేదు. పట్టపగలే దర్జాగా చోరీ చేయడం వీరి స్టయిల్. తలుపులకు గడియపెట్టి అలా వెళ్లి వచ్చే వారి ఇళ్లే వీరి టార్గెట్. గడియ పెట్టి వెళ్లిన ఇళ్లలోకి దూరి,  దర్జాగా తలుపులు తెరచిపెట్టి.. టీవీ, ఫ్యాన్లు ఆన్ చేసి దొరికిన విలువైన వస్తువలన్నీ మూటగట్టుకుని ఉడాయిస్తారు. రెండు నెలల క్రితం జైలుకెళ్లి బయటకొచ్చిన వీరు తమదైన శైలిలో చోరీ చేస్తూ దొరికిపోయారు. విజయవాడ మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి ఆమె కోడలు సాత్విత నెలరోజుల పసికందును ఎత్తుకుని తిరుగుతూ మరీ చోరీ కి తెగబడ్డారు. 

ఇంటికొచ్చిన ఓనర్ నే ఎవరు.. ఎందుకొచ్చారని దర్జాగా ప్రశ్నించిన అత్తాకోడళ్లు

సినీ ఫక్కీలో చోరీ చేస్తూ పట్టుపడిన అత్తా కోడళ్ల ఉదంతం విజయవాడ పరిసరాల్లో హాట్ టాపిక్ అయింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కంకిపాడు బస్టాండు సమీపంలో ఆటో డ్రైవర్ కోటేశ్వరరావు అత్యవసర పని మీద బయటికెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తలుపుకు గడియపెట్టి వెళ్లాడు. ఇలాంటి ఇళ్లనే టార్గెట్ చేసే అలవాటున్న ధనలక్ష్మి తన కోడలు సాత్విత ఇద్దరూ కలసి గడియపెట్టిన కోటేశ్వరరావు ఇంట్లో దూరి ఇంటి తలుపులు తెరచిపెట్టి టీవీ, ఫ్యాన్ ఆన్ చేసి విలువైన వస్తువులన్నీ మూటగట్టడం ప్రారంభించారు. ముందుగా బీరువా తలుపు తెరచి బంగారు, ఇతర ఆభరణాలను తీసుకున్నారు. చిన్నపాటి బంగారం చైన్ ను నెల రోజుల పసికందు డైపర్ లో దాచేశారు. కాసేపట్లో బయటపడే ప్రయత్నంలో ఉండగా.. అదే సమయంలో ఇంటికొచ్చిన ఓనర్ కోటేశ్వరరావు తన ఇంటి తలుపులు తెరచి పెట్టి ఉండడమే కాదు టీవీ, ఫ్యాన్ రెండూ ఆన్ చేసి ఉండడంతో ఆశ్చర్యపోయాడు. విలువైన వస్తువలను మూటగట్టుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్న అత్తా కోడళ్లు ఇంట్లోకొచ్చిన కోటేశ్వరరావును చూసి భయపడకపోగా మీరెవరంటూ.. ఎందుకొచ్చారని దర్జాగా ప్రశ్నించడంతో ఆశ్చర్యపోయాడు. నా ఇంటికొచ్చి నన్నే మీరెవరంటారా అని ఎదురు ప్రశ్నించగా.. అవునా.. మా బంధువుల ఇళ్లని వచ్చామంటూ.. మెల్లగా జారుకుంటుండగా.. కోటేశ్వరరావు వెంటనే ఇరుగు పొరుగు వారిని కేకలేసి పిలిచి పారిపోతున్న అత్తాకోడళ్లను పట్టుకున్నారు. అప్పటికీ వీరు విలువైన వస్తువులను మూటకట్టుకున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మరోసారి తనిఖీ చేయగా.. నెల రోజుల పసికందు డైపర్ లో కూడా ఒక బంగారు ఆభరణం దొరికింది. బాధితుడు కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.