కోడలికి ఉరి వేసి చంపిన అత్త

కోడలికి ఉరి వేసి చంపిన అత్త

గండిపేట, వెలుగు: కుటుంబ కలహాల నేపథ్యంలో కోడలికి చున్నీతో ఉరివేసి చంపిందో అత్త. ఈ ఘటన అత్తాపూర్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్‌‌నగర్​కు చెందిన అజ్మీరీ బేగం(28)కు ఓ బాబు, పాప ఉన్నారు. ఈమె భర్త ఆటో డ్రైవర్. వీరితోపాటు అత్త ఫర్జానా(49) ఉంటోంది. కొంత కాలంగా అజ్మీరీ బేగంకు, ఫర్జానాకు పడట్లేదు. 

తరచూ ఇద్దరూ గొడవ పడుతున్నారు. గురువారం మరోసారి గొడవ పడ్డారు. మాటామాట పెరిగి అజ్మీరీ బేగంపై ఫర్జానా దాడిచేసింది. చున్నీతో కోడలి గొంతును బిగించి చంపేసింది. తర్వాత నేరుగా అత్తాపూర్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌కు వెళ్లింది. తన కోడలు ఉలుకు, పలుకు లేకుండా పడి ఉందని, ఏమైందో తెలియడం లేదని ఏడుస్తూ చెప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఫర్జానాపై అనుమానంతో విచారించగా అసలు విషయం బయటపడింది. తానే ఉరివేసి చంపినట్లు ఒప్పుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌‌కు తరలించారు.