తల్లిదండ్రి మృతితో రోడ్డున పడ్డ అక్కాచెల్లెళ్లు

తల్లిదండ్రి మృతితో రోడ్డున పడ్డ అక్కాచెల్లెళ్లు

మహబూబ్​నగర్, వెలుగు: మూడేళ్ల వ్యవధిలోనే అమ్మానాన్నలను కోల్పోవడంతో ఆ ముగ్గురు ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. ఏమీ తెలియని వయసులో ఎవరి వద్ద ఉండాలో తెలియక ఇంటి గడప వద్దే కూర్చున్నారు. ఆ ఇల్లు కూడా అప్పుల కిందికి పోవడంతో, ఏ టైంలో ఖాళీ చేయాల్సి వస్తుందోనని కన్నీరు కారుస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక, కట్టుబట్టలతో ఉన్న ముగ్గురు చిన్నారులు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మహబూబ్​నగర్ జిల్లా మణికొండ గ్రామానికి చెందిన జి.ఆనంద్(38)​, సుజాత(33) పెండ్లి 2004లో జరిగింది. వీరికి ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురు నందిని జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ ప్రాంతంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో కంప్యూటర్ హార్డ్​వేర్​ అండ్​ సాఫ్ట్​వేర్​ కోర్సు మొదటి సంవత్సరం చదువుతోంది. రెండో అమ్మాయి సింధూజ నారాయణపేట జిల్లా మక్తల్​ బీసీ వెల్ఫేర్​హాస్టల్​లో ఉంటూ ఎనిమిదో తరగతి, చిన్న కూతురు బిందు గ్రామంలోని సర్కారు బడిలో మూడో తరగతి చదువుతోంది. తండ్రి మహబూబ్​నగర్​లో బోరు మోటార్లను రిపేర్లు చేసేవాడు. 2017లో అనారోగ్యానికి గురవడంతో ఇంటి పెద్దను కాపాడుకునేందుకు వైద్యం కోసం భార్య తెలిసినచోట అప్పు చేసింది. రెండేళ్లలో ఆయన వైద్యం కోసం దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చు చేసింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆనంద్​2019 ఫిబ్రవరిలో  మృతిచెందాడు. అప్పటి నుంచి ఆర్థికంగా వీరి కుటుంబం బాగా చితికిపోయింది. అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో సుజాత ఇంటిని, ఉన్న అర ఎకరం పొలాన్ని అమ్మేసింది. అప్పులోళ్లను బతిమాలి తాను ఇల్లు కట్టుకునే దాకా అదే ఇంట్లో తలదాచుకుంటానని వారిని ఒప్పించింది. అదే ఇంట్లో కుట్టు మిషన్​ఏర్పాటు చేసుకొని బ్లౌజులు కుట్టేది. కరోనా టైంలో ఆమె జీవనాధారంపై దెబ్బపడింది. నెలల తరబడి ఉపాధి లేక ఇంట్లో తల్లీకూతుళ్లు రోజుల పాటు ఆకలితో అలమటించిపోయారు. బిడ్డల ఆకలి తీర్చేందుకు సుజాత మళ్లీ దాదాపు లక్ష వరకు అప్పులు చేసింది. ఈ నెల 7న ఆమె కొంత అనారోగ్యానికి గురైంది. స్థానికంగా ఉన్న ఆర్​ఎంపీ వద్ద చూపించుకున్నా నయం కాలేదు. దీంతో దేవరకద్రలో చూపించుకునేందుకు ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రం ఆటోలో ఊరికి తిరిగి వస్తుండగా ఆటోను కారు గుద్దడంతో సుజాత అక్కడికక్కడే చనిపోయింది. దీంతో ముగ్గురు కూతుళ్లు అనాథలయ్యారు. ఇంటి గడప వద్ద బిక్కు బిక్కుమంటూ కూర్చున్నారు. అమ్మానాన్నలను తలచుకుంటూ కన్నీరు పెడుతున్నారు. ప్రస్తుతం వారి చేతిలో రూపాయి కూడా లేదు. దాతలు ముందుకొచ్చి తమను ఆదుకోవాలని అక్కాచెల్లెళ్లు కోరుతున్నారు.

ఇల్లు ఇప్పిస్తే అందులో ఉంటాం
ఉన్న ఇల్లు అప్పుల కిందికి పోయింది. నేను, నా ఇద్దరు చెల్లెళ్లు గవర్నమెంట్​కాలేజీ, స్కూల్స్​లోనే చదువుకుంటున్నాం. ఇల్లు ఇప్పిస్తే అందులోనే ఉండి చదువుకుంటాం. కష్టపడి చదివి గవర్నమెంట్​జాబ్​తెచ్చుకుంటాం.– నందిని, సుజాత పెద్ద కూతురు