పెర్త్: టెస్ట్ క్రికెట్‌లో అత్యంత కఠినమైన, ప్రేక్షకాదరణ కలిగిన యాషెస్ సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. కంగారూల గడ్డపై ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య తొలి పోరు మొదలైంది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 2023లో ఇంగ్లండ్‌లో జరిగిన సిరీస్‌ను 2–2తో డ్రా చేసుకున్న కంగారూలు యాషెస్‌ను తమ వద్దే ఉంచుకున్నారు.
దీంతో ఈ సిరీస్‌లో గెలిచి దాన్ని ఇంగ్లండ్‌కు తీసుకెళ్లాలని ఇంగ్లిష్ జట్టు ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇందు కోసం గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్న జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్‌ను జట్టులోకి తీసుకున్నారు. చివరి యాషెస్ సిరీస్‌లో వుడ్ 17 వికెట్లు తీశాడు. మరోవైపు ఆసీస్‌ను గాయాల బెడద పీడిస్తోంది. గాయాల కారణంగా కెప్టెన్ కమిన్స్, హేజిల్‌వుడ్ తొలి టెస్ట్‌కు దూరమయ్యారు.
స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టును నడిపిస్తున్నాడు. సగం మంది ఫ్రంట్ లైన్ బౌలర్లు లేకుండా ఆసీస్ యాషెస్‌ను మొదలుపెడుతోంది. మిగిలిన వారిలో లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్, ఆఫ్ స్పిన్నర్ నేథన్ లైయన్‌పైనే ఎక్కువ ఆశలు ఉన్నాయి. పెర్త్ బౌన్సీ పిచ్‌పై తాము కచ్చితంగా ప్రభావం చూపిస్తామని ఈ ఇద్దరు ఆశాభావం వ్యక్తం చేశారు.
స్కాట్ బోలాండ్‌తో కలిసి బ్రెండన్ డాగెట్ యాషెస్‌లో అరంగేట్రం చేయనున్నాడు. ఫైనల్ ఎలెవన్‌లో ఆసీస్ స్వదేశీ వారసత్వం ఉన్న ఇద్దరు ప్లేయర్లు ఉండటం ఇదే తొలిసారి. 31 ఏండ్ల జాక్ వెదరాల్డ్ ఓపెనర్‌గా అరంగేట్రం చేయనున్నాడు.
