ఆషాఢం వెళ్లిపోయింది.. పెళ్లి బాజాలకు టైమయింది..

ఆషాఢం వెళ్లిపోయింది.. పెళ్లి బాజాలకు టైమయింది..

ఆషాడ మాసం పోయింది.. శ్రావణమాసం  వచ్చింది. పండుగలకు, శుభకార్యాలకు నెలవు అయిన ఈ శ్రావణ మాసం వచ్చిందంటే మహిళల హడావిడి అంతా ఇంతకాదు. అలాగే శ్రావణమాసం వ్యాపారులకు కలిసొచ్చే మాసం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు పండుగలు మరోవైపు పెళ్లిలు, శుభకార్యాలతో పల్లెలు, పట్టణాలు నూతన శోభను సంతరించుకుంటాయి.  షాపింగ్‌లు చేయడానికి ప్రజలు క్యూ కడతారు.

 మూడు నెలల విరామం తర్వాత పెళ్లిలు స్టార్ట్ అవుతుండటంలో ఫంక్షన్ హాళ్లు, బంగారం షాపులు, వస్త్ర దుకాణాలు సందడిగా మారాయి. పురోహితులు, ఫొటో గ్రాఫర్లు, బ్యూటీపార్లర్లు బిజీ కానున్నాయి.ఏప్రిల్ తర్వాత వరుసగా మూడు నెలలు మూఢాలు, ఆషాడం వచ్చాయి. ఆగస్ట్ 5 నుంచి శ్రావన మాసం ప్రారంభం కావడంతో ఇదే నెలలో 16 శుభ ముహూర్తాలు వచ్చాయి.   అంటే.. ఆగస్ట్  30వ తేదీ వరకు వరుసగా శుభ ముహూర్తాలు ఉన్నట్లు వేదపండితులు చెబుతున్నారు. 

సెప్టెంబర్‌లో వివాహాలు లేకపోయినా అన్నప్రాసనాది ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. ఆ తర్వాత శుభ ముహూర్తాలు అక్టోబర్ నుంచి 2025 ఏప్రిల్ వరకు కంటిన్యూగా ఉంటాయని వేదపండితులు చెబుతున్నారు. ఈ శ్రావణ మాసంలో ఈ నెల 7, 8, 9, 10, 11, 13, 14, 15, 17, 18, 19, 22, 23, 24, 26, 28వ తేదీలు పెళ్లిళ్లకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. అలాగే ఆగస్ట్ 9న నాగుల పంచమి, 16న వరలక్ష్మి వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 27న కృష్ణాష్టమి పండుగలు ఉన్నాయని పండుతులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో సందడి షురూ అయింది.