IND vs AUS 3rd T20I: డేవిడ్, స్టోయినిస్ ఊచకోత.. టీమిండియా ముందు బిగ్ టార్గెట్!

IND vs AUS 3rd T20I: డేవిడ్, స్టోయినిస్ ఊచకోత.. టీమిండియా ముందు బిగ్ టార్గెట్!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు ప్రారంభంలో రాణించినా ఆ తర్వాత తడబడ్డారు. ఆదివారం (నవంబర్ 2) హోబర్ట్ వేదికగా బెల్లెరివ్ ఓవల్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో విజృంభించి భారీ స్కోర్ చేసింది. టిమ్ డేవిడ్ (38 బంతుల్లో 74: 8 ఫోర్లు , 5 సిక్సర్లు) చెలరేగడంతో పాటు మార్కస్ స్టోయినిస్ (39 బంతుల్లో 64: 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. వీరిద్దరి విజృంభణతో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. డేవిడ్ 74 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అర్ష్‌దీప్ సింగ్ మూడు.. వరుణ్ చక్రవర్తి రెండు.. శివమ్ దూబే ఒక వికెట్ పడగొట్టారు.  

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్ లోనే ప్రమాదకర ట్రావిస్ హెడ్ (6)ను అర్షదీప్ సింగ్ ఔట్ చేశాడు. మూడో ఓవర్ లో జోష్ ఇంగ్లిస్ (1) ను పెవిలియన్ కు పంపి కంగారులకు డబుల్ షాక్ ఇచ్చాడు. 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయా ఆస్ట్రేలియా జట్టును కెప్టెన్ మిచెల్ మార్ష్ తో పాటు టిమ్ డేవిడ్ ఆదుకున్నారు. పవర్ ప్లే లో వేగంగా ఆడుతూ పరుగుల వరద పారించారు. ఒక ఎండ్ లో మార్ష్ తడబడుతున్నా మరో ఎండ్ లో డేవిడ్ రెచ్చిపోయి ఆడాడు. మూడో వికెట్ కు 59 పరుగులు జోడించిన తర్వాత 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్ష్ ఔటయ్యాడు. 

ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన మిచెల్ ఒవేన్ ని వరుణ్ చక్రవర్తి తొలి బంతికే పెవిలియన్ కు పంపాడు. దేంతో ఆస్ట్రేలియా 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టుగా కనిపించింది. అయితే టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ స్కోర్ కార్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన డేవిడ్ 74 పరుగుల వద్ద ఔటవ్వడంతో ఇండియాకు బిగ్ రిలీఫ్ లభించింది. డేవిడ్ ఔటైన తర్వాత స్టోయినిస్ షో మొదలయింది. చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.