ODI World Cup 2023: మ్యాక్స్‌వెల్ వీరోచిత డబుల్ సెంచరీ.. వరల్డ్ కప్ సెమీస్‌కు ఆసీస్

ODI World Cup 2023: మ్యాక్స్‌వెల్ వీరోచిత డబుల్ సెంచరీ.. వరల్డ్ కప్ సెమీస్‌కు ఆసీస్

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఊహించని విజయాన్ని అందుకుంది. ఓటమి ఖాయమనుకున్న దశలో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మ్యాక్స్ వెల్(201.. 128 బంతుల్లో, 21 ఫోర్లు, 10 సిక్సులు) మెరుపు డబుల్ సెంచరీతో ఆసీస్ కు విజయాన్ని అందించగా.. గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులా ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోయింది. ఈ విజయంతో ఆసీస్ సెమీ ఫైనల్ కు చేరితే .. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవల్సి వచ్చింది.

 
ముంబైలో వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూల జట్టు ఒకదశలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వార్నర్(18), హెడ్(0), మార్ష్ (24), లబుషేన్(14),మార్కస్ స్టోయినిస్(6) పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇంకా రెండు వందల పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ విజయంపై అందరూ ఆశలు వదిలేసుకున్నారు. ఈ దశలో మ్యాక్స్ వెల్ బౌండరీల వర్షం కురిపిస్తూ ఆఫ్గాన్ జట్టు బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. మెరుపు డబుల్ సెంచరీ చేసి ఆసీస్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కెప్టెన్ కమ్మిన్స్ తో కలిసి 8 వ వికెట్ కు అజేయంగా 202 పరుగులు జోడించారు.   

అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్  జట్టు బ్యాటింగ్ తీసుకోగా..నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ 143 బంతుల్లో..129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.రహ్మత్ షా 30, కెప్టెన్ షాహిదీ 26 పరుగులు చేసి రాణించారు. చివర్లో రషీద్ ఖాన్ 18 బంతుల్లో 3 సిక్సులు రెండు ఫోర్లతో 35 పరుగులు చేసాడు. ఆసీస్ బౌలర్లలో హాజెల్ వుడ్ రెండు వికెట్లు తీసుకోగా.. స్టార్క్, జంపా, మ్యాక్స్ వెల్ కు తలో వికెట్ లభించింది.