SL vs AUS: 58 పరుగులకే ఆలౌట్.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన శ్రీలంక

SL vs AUS: 58 పరుగులకే ఆలౌట్.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన శ్రీలంక

అండర్-19 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. పసికూన కంటే దారుణంగా ఆడిన లంక జట్టు ఊహించని పరాజయాన్ని చవిచూసింది. ఆసీస్ బౌలింగ్ ధాటికి పూర్తిగా చేతులెత్తేసింది. శుక్రవారం (జనవరి 23) విండ్‌హోక్‌లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 58 పరుగులకే ఆలౌటైంది. ఛేజింగ్ లో ఆస్ట్రేలియా 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 62 పరుగులు చేసి గెలిచింది. ఈ టోర్నీలో శ్రీలంకదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఘోరమైన ఆరంభం లభించింది. ఆసీస్ బౌలర్ల ధాటికి లంక జట్టు కేవలం 13 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో నిలిచింది. చార్లెస్ లాచ్మండ్, విల్ బైరోమ్ నిప్పులు చెరిగే పేస్ తో చెలరేగడంతో డిమంత మహావితన (0), విరాన్ చాముదిత (1), దుల్నిత్ సిగేరా (1), విమత్ దిన్సారా (7) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కవిజ గమాగే(10), చమిక హీనతిగల (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. 25 పరుగులకే సగం జట్టుకు కోల్పోయిన లంక జట్టు చివరి 5 వికెట్లకు 33 పరుగులు మాత్రమే చేసింది.  

►ALSO READ | IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టీ20.. బుమ్రా, అక్షర్ దూరం.. కారణం ఇదే! 

ఆస్ట్రేలియా బౌలర్లలో విల్ బైరోమ్ 5 వికెట్లు పడగొట్టాడు. చార్లెస్ లాచ్మండ్,కేసీ బార్టన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. హేడెన్ షిల్లర్ కు ఒక వికెట్ దక్కింది. 59 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఈజీగా విల్ మలాజ్‌జుక్ (4) వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో నితేష్ సామ్యూల్ (19), స్టీవెన్ హోగన్ (28) జాగ్రత్తగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. 5 వికెట్లు తీసుకున్న విల్ బైరోమ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.