- మ. 1.45 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
హోబర్ట్: బ్యాటర్ల వైఫల్యంతో టీ20 సిరీస్‌లో బోణీ చేయలేకపోయిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో మూడో టీ20కి రెడీ అయ్యింది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి లెక్క సరిచేయాలని భావిస్తోంది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దుకాగా, రెండో పోరులో ఆసీస్ గెలిచింది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూలు 1–0 లీడ్‌లో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ పేసర్ హేజిల్‌వుడ్ లేకపోవడం ఇండియాకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. సరైన లెంగ్త్, కచ్చితత్వంతో కూడిన బౌన్స్‌తో ఇప్పటివరకు ఇండియా బ్యాటర్లను హేజిల్‌వుడ్ ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ నెలాఖారులో యాషెస్ సిరీస్ ప్రారంభం అవుతుండటంతో హేజిల్‌వుడ్‌కు విరామం ఇచ్చారు.
దాంతో మిగిలిన మూడు టీ20ల్లోనూ గెలిచి సూర్యకుమార్ బృందం సిరీస్‌ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి. బౌన్స్, సీమ్ కదలికలను అంచనా వేయడంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న టీమిండియా టాప్ ఆర్డర్ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గాడిలో పడుతుందేమో చూడాలి. సూర్య, శుభ్‌మన్ గిల్ అదనపు బౌన్స్, సీమ్ కదలికలతో వచ్చే డెలివరీలను ఆడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని ఈ మ్యాచ్‌లో అధిగమించాలి. అభిషేక్ శర్మ ఫామ్‌లో ఉన్నా.. శాంసన్, తిలక్ వర్మ బ్యాట్లకు పని చెప్పాల్సిన సమయం వచ్చింది. హోబర్ట్ గ్రౌండ్ చిన్నగా ఉండటంతో బౌండ్రీ పరిమాణం కూడా తగ్గుతుంది. కాబట్టి కవర్, పాయింట్, స్క్వేర్ లెగ్, మిడ్ వికెట్ మీదుగా ఆడేటప్పుడు బాల్ లెంగ్త్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇదే గ్రౌండ్‌లో 2012లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 321 రన్స్ లక్ష్య ఛేదనలో కోహ్లీ 86 బాల్స్‌లో అజేయంగా 133 రన్స్ కొట్టాడు. కాబట్టి బ్యాటర్లు కాస్త నిలకడను చూపితే పరుగుల వర్షం ఖాయం. బ్యాటింగ్ డెప్త్‌ను పెంచుకోవడం కోసం అర్ష్‌దీప్‌ను పక్కనబెట్టడం ఇప్పుడు చర్చగా మారింది. దీంతో తుది జట్టులో మార్పులు చేసి అర్ష్‌దీప్‌ను తీసుకొస్తారేమో చూడాలి. హర్షిత్ రాణా బ్యాటింగ్ చేస్తాడన్న కారణంతో కొనసాగిస్తున్నా.. స్వల్ప స్కోర్లను కాపాడటంలో అతనికి బౌలర్‌గా పెద్ద అనుభవం లేదు. కాబట్టి బుమ్రా తుది జట్టులో ఉంటే రెండో పేసర్‌గా అర్ష్‌దీప్ ఉండాల్సిందేనని మాజీలు చెబుతున్నారు. అప్పుడు ముగ్గురు స్పిన్నర్లలో ఒకర్ని తప్పించి అతని అవకాశం కల్పించాలి. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ ప్లేస్ ఖాయంగా కనిపిస్తున్నా.. కుల్దీప్, వరుణ్‌లో ఒకరిని తప్పిస్తారా?.. లేకపోతే పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను తప్పిస్తారా? చూడాలి.
టాప్ ఫామ్‌లో ఆసీస్..
మరోవైపు ఆసీస్ జట్టు అన్ని అంశాల్లో టాప్ ఫామ్‌లో కనిపిస్తోంది. ఓపెనింగ్‌లో మార్ష్, హెడ్‌కు తిరుగులేదు. జోస్ ఇంగ్లిస్ ఫర్వాలేదనిపించినా.. టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్ గాడిలో పడాల్సి ఉంది. ఆల్‌రౌండర్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్ వైఫల్యం కొనసాగుతోంది. వీళ్లు గాడిలో పడితే భారీ స్కోరు ఖాయం. హేజిల్‌వుడ్ ప్లేస్‌లో వచ్చిన సీన్ అబాట్ తుది జట్టులోకి రావొచ్చు. జేవియర్ బార్ట్‌లెట్‌తో పాటు సొంత గ్రౌండ్‌లో నేథన్ ఎలిస్ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. స్పిన్నర్ కునెమన్ ప్రభావం చూపించాల్సి ఉంది.
తుది జట్లు (అంచనా):
ఇండియా: సూర్యకుమార్ (కెప్టెన్), గిల్, అభిషేక్, శాంసన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, శివమ్ దూబే / అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోస్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, జేవియర్ బార్ట్‌లెట్, నేథన్ ఎలిస్, మాథ్యూ కునెమన్, సీన్ అబాట్.
