హోబర్ట్: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న టీమిండియా.. టీ20 సిరీస్‌లో బోణీ చేసింది. టార్గెట్ ఛేజింగ్‌లో వాషింగ్టన్ సుందర్ (23 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 నాటౌట్) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన మూడో టీ20లో ఇండియా 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. టాస్ ఓడిన ఆసీస్ 20 ఓవర్లలో 186/6 స్కోరు చేసింది.
టిమ్ డేవిడ్ (38 బాల్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74), మార్కస్ స్టోయినిస్ (39 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64) చెలరేగారు. తర్వాత ఇండియా 18.3 ఓవర్లలో 188/5 స్కోరు చేసి నెగ్గింది. తిలక్ వర్మ (29), అభిషేక్ శర్మ (25) ఫర్వాలేదనిపించారు. మూడు వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 గురువారం కాన్‌బెర్రాలో జరుగుతుంది.
అర్ష్‌దీప్ అదుర్స్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ కంగారూలను ముప్పుతిప్పలు పెట్టాడు. తన తొలి రెండు ఓవర్లలోనే ట్రావిస్ హెడ్ (6), జోస్ ఇంగ్లిస్ (1)ని ఔట్ చేశాడు. దీంతో 14/2 స్కోరు వద్ద షాన్ మార్ష్ (11)కు తోడైన టిమ్ డేవిడ్ పవర్ హిట్టింగ్ షాట్లతో రెచ్చిపోయాడు. ప్రతి బౌలర్‌ను టార్గెట్ చేసి భారీ సిక్స్‌లు, ఫోర్లు బాదాడు. కానీ 8వ ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి (2/33) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస బాల్స్‌లో మార్ష్, మిచెల్ ఓవెన్ (0)ను ఔట్ చేశాడు. మూడో వికెట్‌కు 59 రన్స్ భాగస్వామ్యం ముగిసింది.
ఈ దశలో వచ్చిన స్టోయినిస్ మళ్లీ ఇన్నింగ్స్‌లో ఊపు తెచ్చాడు. 20 రన్స్ వద్ద సుందర్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన డేవిడ్ ఏమాత్రం తగ్గలేదు. శివమ్ దూబే (1/43) బౌలింగ్‌లో స్టోయినిస్, డేవిడ్ క్లీన్ సిక్స్‌లు కొట్టారు. 23 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన డేవిడ్ ఐదో వికెట్‌కు 45 రన్స్ జోడించి వెనుదిరిగాడు. స్టోయినిస్‌కు జత కలిసిన మాథ్యూ షార్ట్ (26 నాటౌట్) కూడా దుమ్మురేపాడు. వీరిద్దరు పోటీపడి బౌండ్రీలు బాదారు. ఈ క్రమంలో 32 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టిన స్టోయినిస్ ఆరో వికెట్‌కు 64 రన్స్ జోడించి ఆఖరి ఓవర్‌లో అర్ష్‌దీప్‌కు వికెట్ ఇచ్చాడు.
టాప్ లేపారు..
ఛేజింగ్‌లో ఇండియాను ఎలిస్ (3/36) ఇబ్బందిపెట్టినా.. టాప్ ఆర్డర్ బ్యాటర్లు తలా కొన్ని రన్స్ జత చేశారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (15), అభిషేక్ శర్మ 3.3 ఓవర్లలోనే 33 రన్స్ జోడించి శుభారంభాన్నివ్వగా, కెప్టెన్ సూర్యకుమార్ (24) దాన్ని కొనసాగించాడు. ఈ ముగ్గురు కలిసి 76 రన్స్ జత చేశారు. క్రీజులో ఉన్నంతసేపు హడలెత్తించిన తిలక్ వర్మ (29)కు అక్షర్ పటేల్ (17) కాసేపు అండగా నిలిచాడు. నాలుగో వికెట్‌కు 35 రన్స్ జత చేసి వెనుదిరిగాడు. 111/4 వద్ద వచ్చిన సుందర్ ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు.
లాంగాన్, లాంగాఫ్, మిడ్ వికెట్ మీదుగా నాలుగు భారీ సిక్సర్లు కొట్టాడు. రెండో ఎండ్‌లో తిలక్ కూడా మంచి సహకారం అందించాడు. ఐదో వికెట్‌కు 34 రన్స్ జోడించి తిలక్ ఔటైనా.. సుందర్ చివరి వరకు నిలిచాడు. జితేష్ శర్మ (22 నాటౌట్)తో ఆరో వికెట్‌కు 43 రన్స్ జత చేసి ఈజీగా గెలిపించాడు. బార్ట్‌లెట్, స్టోయినిస్ చెరో వికెట్ తీశారు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 186/6 (టిమ్ డేవిడ్ 74, మార్కస్ స్టోయినిస్ 64, అర్ష్‌దీప్ 3/35, వరుణ్ 2/33). ఇండియా: 18.3 ఓవర్లలో 188/5 (సుందర్ 49*, తిలక్ వర్మ 29, ఎలిస్ 3/36).
