- గుండెపోటుతో ఆటో కార్మికుడు మృతి
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుద్దాలలో విషాదం
కోనరావుపేట, వెలుగు: తండ్రి ఆకస్మిక మృతితో ఆడ బిడ్డలు.. ఆ నలుగురు అయిన విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. కోనారావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఎగదండి బాబు(56), నర్సమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు మమత, స్వప్న, శ్వేత, సాహిత్య ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు పెండ్లి చేశారు. బాబు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున నిద్ర లేచిన బాబు బాత్రూమ్ కు వెళ్లగా ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు.
కుటుంబ సభ్యులు వెంటనే సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించారు. అప్పటికే అతను గుండెపోటుతో మృతిచెందాడని డాక్టర్లు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. నలుగురు కూతుళ్లే తండ్రి పాడేను మోశారు. చితికి చిన్న కూతురు సాహిత్య నిప్పుపెట్టారు. తండ్రి ఆకాల మృతితో కూతుళ్లను రోదనలను చూసి గ్రామస్తులు కూడా కంటతడి పెట్టారు. బాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కుంటెల్లి నాగరాజు ఆటో కార్మికులు, గ్రామస్తులు కోరుతున్నారు.
