- తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
- ఒకరి ఆత్మహత్యాయత్నం.. ఉద్రిక్తత
అబిడ్స్, వెలుగు: మొజంజాహి మార్కెట్ (ఎంజే) చౌరస్తా వద్ద శనివారం ఉదయం ఆటో డ్రైవర్లు భారీ ఆందోళన చేపట్టారు. ఆటో డ్రైవర్స్ బంధు, ఇన్ఫార్మల్ లేబర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుమారు 100 ఆటోలతో చౌరస్తాను ‘చక్కా జామ్’ పేరుతో దిగ్బంధం చేశారు. ఈ నిరసన వల్ల గంటన్నర పాటు ఇరువైపుల వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని ఇతర జిల్లాల రిజిస్ట్రేషన్ ఆటోలను నిలిపివేయాలని, ఎల్లో ప్లేట్ లేకుండా నడుస్తున్న ఓలా, ఉబెర్, రాపిడో సంస్థలపై చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. 15 ఏండ్లుగా మారని మీటర్ చార్జీలను ప్రస్తుత ఇంధన ధరలకు అనుగుణంగా సవరించాలని కోరారు. ప్రతి డ్రైవర్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని నినదించారు.
ఆందోళన సమయంలో ఒక డ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఫెడరేషన్ చైర్మన్ మీర్ ఇనాయత్ అలీ బాక్రి మాట్లాడుతూ.. పెరుగుతున్న ఖర్చులతో కుటుంబ పోషణ భారంగా మారిందని, సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. చివరకు పోలీసులు చర్చలు జరపడంతో డ్రైవర్లు ఆందోళన విరమించారు.

