- వారి డిమాండ్స్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది: మంత్రి పొన్నం
- ఆర్టీసీ పక్షాన ఈవీ ఆటోలు కొనే ప్రసక్తే లేదు
- ఓలా, ఉబెర్ మాదిరి ప్రభుత్వం తరఫున యాప్
- ఎల్లో నంబర్ ప్లేట్ ఉన్న టూవీలర్ల పైనే
- ప్రయాణికులను తీసుకెళ్లేలా నిర్ణయం
- వచ్చే నెల 1న కార్మిక శాఖ, రవాణా శాఖ, ఆటో కార్మిక సంఘాలతో భేటీకి హామీ
- 12 వేల సాయంపై సీఎంతో చర్చిస్తానని వెల్లడి
హైదరాబాద్ వెలుగు: ఆటో కార్మిక సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మెను కార్మిక సంఘాలు విరమించుకున్నాయి. హైదరాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో జేటీసీలు చంద్రశేఖర్‌గౌడ్, రమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
ఈ సారాంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌కు వివరించగా.. ఆయన ఫోన్‌లో కార్మికులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఆటో కార్మికుల డిమాండ్స్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఆర్టీసీ పక్షాన ఈవీ ఆటోలు కొనే ప్రసక్తే లేదని, అది దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. విధివిధానాలకు సెప్టెంబర్ 1 న కార్మిక శాఖ, రవాణా శాఖ, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 2012 తర్వాత ఆటో చార్జీలు పెంచలేదని, కాబట్టి ఆటో చార్జీలు పెంచడానికి అంగీకరిస్తూ.. ఎంత పెంచాలి? అనే దానిపై తగిన నివేదిక తీసుకొని సంబంధిత జీవో విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు.
ఓలా, ఉబెర్ మాదిరి ప్రభుత్వం తరఫున యాప్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని మంత్రి చెప్పారు. ప్రభుత్వ ఐటీ శాఖ నుంచి యాప్ ప్రారంభించేందుకు తగిన ప్రక్రియ ప్రారంభిస్తామని, ద్విచక్ర వాహనాల్లో ర్యాపిడో, ఓలా, ఉబెర్ నడిపే వాటికి ఎల్లో ప్లేట్ ఉంటేనే ప్రయాణికులను తరలించేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బంద్ విరమించుకోవాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి సమ్మె విరమించిన ఆటో కార్మిక సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
రూ.12 వేల సాయంపై సీఎంతో చర్చిస్తా..
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు 12 వేల రూపాయల సాయం అంశంపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తగిన అంశాలు పరిగణనలోకి తీసుకొని సీఎం, డిప్యూటీ సీఎం, సహచర మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
హైదరాబాద్ క్యూర్ ఏరియా పరిధిలో పాత డీజిల్, పెట్రోల్ ఆటోలకు రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చడానికి 1.50 లక్షలు ప్రభుత్వం సహాయం అందిస్తుందని, కొత్త ఆటోలు కొనుగోలు చేయడానికి సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. చర్చల్లో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి , అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్ ,శివ లింగయ్య, వెంకట రమణ, వివిధ ఆటో, క్యాబ్, వ్యాన్ యూనియన్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మంత్రి చొరవతో సమ్మెను విరమించినం
ప్రభుత్వం తమ డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి తల పెట్టిన బంద్ ను విరమించినట్టు తెలంగాణ ఆటో సంఘాల జేఏసీ ప్రకటించింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఏ సత్తిరెడ్డి, రవిశంకర్, బి. వెంకటేశ్, మారయ్య తదితరులు మాట్లాడుతూ.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఆర్టీఏ ఉన్నతాధికారులు చంద్ర శేఖర్ గౌడ్, రమేశ్ కుమార్‌తో జరిగిన చర్చలు సఫలమైనట్టు వారు తెలిపారు. ఆటో సంఘాల జేఏసీ చేసిన 14 డిమాండ్ల అమలుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు.
