- ఆటోమేటిక్ గా మిల్లుల కేటాయింపు
- లారీ లోడ్లు ఏ మిల్లుకు వెళ్లాలో తేల్చేది అప్పుడే
- జీపీఎస్ ద్వారా లారీల ట్రాకింగ్
- కొనుగోళ్లలో పారదర్శకతకు సివిల్ సప్లై చర్యలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక సంస్కరణలను అమలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో లారీ లోడ్ చేసిన వెంటనే ఆన్‌లైన్‌లో ట్రక్ షీట్ జనరేట్ చేసి, సంబంధిత మిల్లును ఆటోమేటిక్‌గా కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టింది. మాన్యువల్ మిల్లుల కేటాయింపు విధానానికి పూర్తిగా ముగింపు పలికింది. కొత్త విధానంలో, లారీలో ధాన్యం లోడ్ చేసే సమయంలో ముందుగా మిల్లు వివరాలు తెలియవు. ట్రక్ షీట్ ఆన్‌లైన్‌లో జనరేట్ చేసిన తర్వాతే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఏ మిల్లుకు తరలించాలో సూచిస్తుంది. ట్రక్ షీట్‌లో పేర్కొన్న మిల్లుకే ధాన్యాన్ని తప్పనిసరిగా తరలించాల్సి ఉంటుంది. మిల్లుల కెపాసిటీని పరిగణలోకి తీసుకుని కేటాయింపులు జరగనున్నాయి. దీంతో ఇప్పటి వరకు మిల్లర్లు, కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు చేస్తున్న అక్రమాలకు చెక్ పడనుంది.
జీపీఎస్‌తో కట్టుదిట్టమైన పర్యవేక్షణ
వడ్ల రవాణాలో అవకతవకలను అరికట్టేందుకు జీపీఎస్ విధానాన్ని తప్పనిసరి చేశారు. లారీలు, డీసీఎం వాహనాల్లో జీపీఎస్ పరికరాలు అమర్చడం తప్పనిసరి. జీపీఎస్ సరిగా పని చేస్తున్న వాహనాలకు మాత్రమే లోడింగ్‌కు అనుమతిస్తారు. వాహనాల కదలికలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించి, ధాన్యం ఎక్కడికి వెళ్తోందన్న దానిపై స్పష్టత ఉంటుంది.
రియల్ టైమ్ డేటా ఎంట్రీ తప్పనిసరి
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసే సమయంలోనే రైతుల వివరాలు, ధాన్యం పరిమాణం వంటి సమాచారాన్ని ట్యాబ్‌ల ద్వారా వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రియల్ టైమ్ డేటా నమోదు ద్వారా పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు చెల్లింపులు వేగంగా జరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయనున్నారు.
పారదర్శకతతో రైతులకు లాభం
సివిల్ సప్లై శాఖ తీసుకొచ్చిన ఈ సంస్కరణలతో ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పెరిగి, రైతులకు న్యాయమైన ధర లభించడంతో పాటు చెల్లింపులు వేగంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ విధానం ద్వారా ధాన్యం కొనుగోళ్లలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సాంకేతిక సదుపాయాల వినియోగంతో కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించింది. ఇన్నాళ్లు ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు, కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. తూకాల్లో మోసాలు, నాణ్యత లేదనే పేరుతో కోతలు, ట్రక్ షీట్లలో అవకతవకలు వంటి సమస్యలు నమోదయ్యాయి.
కొన్ని చోట్ల క్వింటాల్ కు 4 నుంచి 6 కిలోల వరకు కోతలు పెట్టడం, ట్రక్ షీట్లు ఆలస్యంగా ఇవ్వడం, మిల్లుల్లో ధాన్యం దింపుకోవడానికి నిరాకరించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వాహనాలకు జీపీఎస్ అమర్చి మోసపూరితంగా ట్రాకింగ్ చూపించడం, నిబంధనలకు విరుద్ధంగా ట్రక్ షీట్లు జారీ చేయడం వంటి దందాలు వెలుగుచూశాయి. ఈక్రమంలో కొత్త ఆన్‌లైన్ విధానం ద్వారా ఇలాంటి అక్రమాలకు పూర్తిగా చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

