ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మరి కొన్ని గంటల్లో రెండో టీ20 ప్రారంభం కానుంది. శుక్రవారం (జనవరి 23) రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ లో గెలిచిన టీమిండియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఫస్ట్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్‌తో గ్రాండ్ విక్టరీ అందుకున్న సూర్యకుమార్ సేన అదే జోరును రాయ్‌పూర్‌లోనూ కొనసాగించి సిరీస్‌లో 2–0తో ముందంజ వేయాలని చూస్తోంది. మరోవైపు ఇండియాకు ఎలాగైనా షాక్ ఇవ్వాలని న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది. రెండో వన్డేకు ముందు భారత జట్టుకు ఊహించని సమస్య వచ్చి చేరింది.
టీమిండియా ఆల్ రౌండర్.. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ రెండో టీ20 ఆడడం అనుమానంగా మారింది. తొలి వన్డేలో బౌలింగ్ వేస్తున్నప్పుడు రిటర్న్ క్యాచ్ అందుకునే క్రమంలో అక్షర్ గాయపడ్డాడు. గాయం కావడంతో ఓవర్ మధ్యలోనే గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. దీంతో మిగిలిన ఓవర్ ను అభిషేక్ శర్మ పూర్తి చేశాడు. రెండో టీ20కి అక్షర్ అందుబాటులో లేకపోతే అతని రీప్లేస్ మెంట్ కష్టంగా మారుతుంది. కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తే బ్యాటింగ్ డెప్త్ తగ్గుతుంది. ఒకవేళ హర్షిత్ రానాకు అవకాశం ఇస్తే జట్టులో వరుణ్ చక్రవర్తి ఒక్కడే స్పిన్నర్ గా ఉంటాడు. దీంతో ఇప్పుడు అక్షర్ ను రీప్లేస్ చేయడం పెద్ద సవాలుగా మారింది.
Also Read :WPL లో గుజరాత్ గెలుపు బాట
బ్యాటింగ్ డెప్త్ తగ్గినా స్పిన్ అవసరం కావడంతో రెండో టీ20లో కుల్దీప్ కు ఛాన్స్ దక్కొచ్చు. ఈ ఒక్క మార్పుతోనే టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. బ్యాకప్ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ మూడో స్థానంలో ఆడతాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కు వస్తాడు. ఐదో స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య స్థానానికి ఎలాంటి ఢోఖా లేదు. ఆరో స్థానంలో రింకూ సింగ్.. ఏడో స్థానంలో శివమ్ దూబే ఆడతారు. ఎనిమిదో స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఫిట్ గా లేకపోతే కుల్దీప్ జట్టులోకి రానున్నాడు. వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా,అర్షదీప్ సింగ్ స్పెషలిస్ట్ బౌలర్లుగా కొనసాగుతారు.
