
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కొత్త కెప్టెన్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అక్షర్ పటేల్ స్థానంలో కొత్త కెప్టెన్‌ను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అక్షర్ కేవలం ప్లేయర్ గానే జట్టులో కొనసాగనున్నాడు. ఒక్క సీజన్ కే అక్షర్ ను పక్కన పెట్టడానికి ఎలాంటి స్పష్టత లేదు. 2025 ఐపీఎల్ సీజన్ లో అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. కెప్టెన్ గా పర్వాలేదనిపించినప్పటికీ అక్షర్ పై ఢిల్లీ యాజమాన్యం సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది.
ఒకవేళ అక్షర్ ను తొలగిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎవరు కెప్టెన్ గా ఎంపికవుతారనే విషయంలో ఆసక్తి నెలకొంది. జట్టులో కేఎల్ రాహుల్ లాంటి అనుభవమున్న ప్లేయర్ ఉన్నప్పటికీ ఈ సీనియర్ ప్లేయర్ గత సీజన్ లోనే తాను కెప్టెన్ పదవి వద్దని చెప్పాడు. ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా ఉంటున్న డుప్లెసిస్ కు వయసు 40 ఏళ్ళు దాటింది. వీరిద్దరిలో ఎవరో ఒకరిని కెప్టెన్ గా చేస్తారంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సౌతాఫ్రికా యంగ్ ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడానికి అతడికి అనుభవం లేదు. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐపీఎల్ 2026 మినీ-వేలంలో ఢిల్లీ కెప్టెన్ మెటీరియల్ కోసం ఎవరికోసమైనా భారీగా ఖర్చు పెట్టొచ్చు.
మినీ ఆక్షన్ కు ముందు ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 14.76 కోట్లు మిగిలి ఉన్నాయి. ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ సీనియర్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. కేఎల్ రాహుల్, డుప్లెసిస్, మిచెల్ స్టార్క్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ 2019 నుంచి టీమ్‌లో కీలక ప్లేయర్ ఉన్న అక్షర్‌కే పగ్గాలు ఇచ్చింది. గత సీజన్ మెగా ఆక్షన్ కు ముందు ఢిల్లీ రూ. 16.50 కోట్లతో ఈ టీమిండియా ఆల్ రౌండర్ ను రిటైన్ చేసుకుంది. దీంతో ఐపీఎల్‌లో అక్షర్ కు తొలిసారి కెప్టెన్సీ దక్కింది.
ఇటీవలే ఆసియా కప్ కు అక్షర్ పటేల్ ను టీ20 వైస్ కెప్టెన్ గా తొలగించి అతని స్థానంలో యువ బ్యాటర్ శుభమాన్ గిల్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో అక్షర్ పటేల్ కు భారత వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చినా ఒక్క సిరీస్ కే పరిమితమయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్ జట్టును సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ వంటి టోర్నీల్లో నడిపించాడు.