యాక్సిస్ బ్యాంక్ గత ఏడాది కాలంగా టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెట్టింది. దీనివల్ల పని వేగంగా జరుగుతుండటంతో, ఉద్యోగుల అవసరం కొంత తగ్గిందని బ్యాంక్ వెల్లడించింది. ఫలితంగా, 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి బ్యాంక్ సిబ్బందుల్లో 3,000 మంది తగ్గుదల కనిపించింది.
గత ఏడాది 1.04 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య, ఇప్పుడు 1.01 లక్షలకు చేరింది. ఇందుకు కారణం బ్యాంక్ పనులను డిజిటల్ పద్ధతిలోకి మార్చుకోవడం వల్ల తక్కువ మందితోనే ఎక్కువ పనిని సాధ్యమవుతుంది.
ఉద్యోగుల తగ్గింపు అనేది ఒక విభాగంలో కాదని... బ్యాంక్ మొత్తం మీద అన్ని విభాగాల్లోనూ సిబ్బంది తగ్గింపు ఉందని తెలిపింది.
బ్యాంక్ సీఈఓ అమితాబ్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం... సిబ్బంది తగ్గినప్పటికీ, ఆక్సిస్ బ్యాంక్ దేశవ్యాప్తంగా కొత్తగా 400 శాఖలను ప్రారంభించింది. గత 3-4 ఏళ్లుగా బ్యాంక్ మొత్తం ఖర్చులో 9 నుంచి 10 శాతం కేవలం టెక్నాలజీ కోసమే కేటాయిస్తోంది.
ప్రస్తుతం బ్యాంక్ పనులను వేగవంతం చేయడానికి ఆటోమేషన్ వాడుతున్నారు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాల తొలగింపు ఇంకా భారీ స్థాయిలో జరగడం లేదని బ్యాంక్ స్పష్టం చేసింది.
ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో బ్యాంక్ రూ. 7,071 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అదే గత ఏడాది చూస్తే ఇదే సమయంలో రూ. 7,117 కోట్లుగా ఉంది. అయితే షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ. 1 చొప్పున లాభాన్ని బ్యాంక్ ప్రకటించింది.

