సర్కార్​ దవాఖాన్లల్లనే ఆయుష్మాన్ భారత్ స్కీమ్

 సర్కార్​ దవాఖాన్లల్లనే ఆయుష్మాన్ భారత్ స్కీమ్
  • డాక్టర్లు, టెక్నికల్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌కు ట్రైనింగ్ షురూ

హైదరాబాద్, వెలుగు: ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను తొలుత ప్రభుత్వ దవాఖాన్లలో అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ దవాఖాన్ల సూపరింటెండెంట్లు, డాక్టర్లు, టెక్నీషియన్లకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఓరియెంటేషన్‌‌‌‌‌‌‌‌ క్లాసులు ప్రారంభించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో రెండు రోజులుగా క్లాసులు జరుగుతున్నాయి. ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ కలిపి అమలు చేసేందుకు రూపొందించిన రూల్స్‌‌‌‌‌‌‌‌, సాంకేతికతపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, వీలైనంత త్వరగా స్కీమ్‌‌‌‌‌‌‌‌ను అమల్లోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ట్రస్ట్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకరు చెప్పారు.  
ప్రైవేట్ మేనేజ్ మెంట్ల అభ్యంతరాలు.. 
‘ఆయుష్మాన్ స్కీమ్ పత్తాలేదు’ అనే హెడ్డింగ్​తో ఈ నెల 23న వెలుగు పేపర్​లో వార్త ప్రచురించగా, స్పందించిన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసర్లు.. ప్రైవేట్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ ప్రతినిధులను సంప్రదించినట్టు తెలిసింది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ కలిపి అమలు చేయడంపై చర్చించేందుకు సమావేశానికి రావాలని పిలిచినట్టు సమాచారం. అయితే రెండూ కలిపి అమలు చేయడంపై ప్రైవేటు మేనేజ్ మెంట్లు అభ్యంతరాలు లేవనెత్తినట్టు తెలిసింది. వాటిపై క్లారిటీ ఇచ్చాకే ఆయుష్మాన్ అమలుపై నిర్ణయం తీసుకుంటామని మేనేజ్ మెంట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటళ్ల మేనేజ్ మెంట్లతో వచ్చే నెల మొదటి వారంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సమావేశం నిర్వహించనుంది. మరోవైపు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేస్తున్న నేషనల్ హెల్త్ అథారిటీ ఆఫీసర్లు.. రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటళ్ల మేనేజ్ మెంట్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్‌‌‌‌‌‌‌‌ అమలుకు సహకరించాలని కోరారు. వచ్చే నెలలో జరగనున్న మీటింగ్​లో ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఏ ఆఫీసర్లు కూడా పాల్గొననున్నారు. 
రెండు స్కీములూ నడుస్తయ్.. 
ఆరోగ్యశ్రీలో 972 రకాల ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు కవర్ అవుతుండగా, ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,350 అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేని 540 ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు  ఆరోగ్యశ్రీలో ఉండగా, ఆరోగ్యశ్రీలో లేని 685  ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. రెండింటిలో కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 430 ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు ఉన్నాయి. రాష్ర్టంలో 26.11 లక్షల కుటుంబాలు ఆయుష్మాన్ పరిధిలోకి వస్తున్నాయి. ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం వస్తే, వాళ్లకు ఆయుష్మాన్ కిందనే ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ అందిస్తారు. ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌లో లేని రోగాలకు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్ మెంట్ అందిస్తారు. ఇక ఆయుష్మాన్ పరిధిలోకి రానివాళ్లకు ఇప్పటిలాగే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇస్తారు. 
ఆరోగ్యశ్రీ ప్యాకేజీలే!
ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్యాకేజీల రేట్లు.. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల కంటే తక్కువగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో ఒక ట్రీట్​మెంట్ కు రూ.60 వేలు ఉంటే, అదే ట్రీట్​మెంట్ కు ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌లో రూ.40 వేలు ఉంది. దీంతో ఆరోగ్యశ్రీ పేషెంట్‌‌‌‌‌‌‌‌కు ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌ కింద ట్రీట్​మెంట్ అందించేందుకు ప్రైవేటు మేనేజ్ మెంట్లు అభ్యంతరం చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చే రూ.40 వేలకు అదనంగా, రూ.20 వేలు కలిపి రాష్ట్రం తమకు రూ.60 వేలు చెల్లించాలని కోరుతున్నాయి. ఇందుకు రాష్ట్ర సర్కార్ కూడా సుముఖంగా ఉన్నట్టు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ, జేహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, ఈహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్ కోసం రూ.వెయ్యి కోట్ల దాకా ఖర్చవుతుండగా.. ఆయుష్మాన్ అమలు చేస్తే కేంద్రం నుంచే రూ.250 కోట్ల వరకు రాష్ట్రానికి రానున్నాయి.