
ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లపై 2019లో విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ కు ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోని న్యాయస్థానం మూడేండ్ల జైలు శిక్ష విధించింది. రూ.25 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. దేశంలో ముస్లింల ఉనికి కష్టతరమైన వాతావరణాన్ని ప్రధాని మోడీ సృష్టిస్తున్నారని ఆజంఖాన్ అప్పట్లో వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. రాంపూర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల్లో బలమైన అనుచరులను కలిగి ఉన్న ఆజంఖాన్ కు సమాజ్ వాదీ పార్టీలో బలమైన నాయకుడిగా పేరుంది. అఖిలేష్ యాదవ్ తర్వాత ఆ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ సంపాదించుకున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆజంఖాన్ అసెంబ్లీలో తన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఏ ఎమ్మెల్యే అయినా రెండేళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడితే శాసనసభలో సభ్యత్వం కోల్పోతాడు.
ఆజంఖాన్ కు మే నెలలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. భూ కబ్జా కేసులో ఆయన రెండేళ్లపాటు జైలు జీవితం గడిపారు. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆజంఖాన్ పై అవినీతి, దొంగతనం సహా 90 కేసులు నమోదయ్యాయి. విద్వేషపూరిత ప్రసంగాలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని, ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు కోరిన వారం తర్వాత ఆజంఖాన్ కు ఈమేరకు శిక్షపడింది.