బీ ఫామ్ ఎవరికి దక్కేనో?..కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు రెబల్స్ బెడద

బీ ఫామ్ ఎవరికి దక్కేనో?..కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు రెబల్స్ బెడద
  • ఒక్కో వార్డులో కనీసం ముగ్గురు నామినేషన్లు
  • ముఖ్యనేతలకు తప్పని బుజ్జగింపుల తలనొప్పులు
  • బీఆర్ఎస్​ లో ప్రతి వర్గం నుంచి ఒక నామినేషన్​
  • ఇండిపెండెంట్ల సంఖ్యా ఎక్కువే!

ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు :  మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల బీ ఫామ్​ ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అన్ని మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే, లేదా ముఖ్య నాయకులు ఎంపిక చేసిన అభ్యర్థులే కాకుండా అదనంగా చాలా మంది పార్టీ పేరుతో నామినేషన్లు వేశారు. ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే ఇబ్బంది లేకుండా కొన్ని డమ్మీ నామినేషన్లను ఆయా పార్టీలే దాఖలు చేయించగా, మరికొందరు కూడా సొంతంగా నామినేషన్లు వేశారు. 

పొత్తు చర్చల నేపథ్యంలో ఆయా పార్టీలు వార్డులను పంచుకున్నా, పార్టీ పొత్తుల అవగాహనతో సంబంధం లేకుండా క్యాండిడేట్లు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో యావరేజీగా ఒక్కో వార్డుకు కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు విత్ డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అన్ని పార్టీల్లో తలనొప్పిగా మారింది. 

ఖమ్మం జిల్లాలో పరిస్థితి.. 

ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో 117 వార్డులున్నాయి. వీటికి మొత్తం 779 మంది అభ్యర్థులు 923 నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో ఇండిపెండెంట్లు, రాష్ట్రీయ గుర్తింపు పొందిన పార్టీలను మినహాయిస్తే అధికంగా కాంగ్రెస్​ నుంచి 117 వార్డుల కోసం 374 మంది నామినేషన్లు వేశారు. ఇక బీఆర్ఎస్​ తరఫున 251 మంది నామినేషన్లు ఫైల్ చేశారు. 

సీపీఎంతో అవగాహన ఉన్నా, ఒక్కో వార్డుకు రెండు కంటే ఎక్కువ నామినేషన్లు వేయడం గమనార్హం. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో పొత్తులకు భిన్నంగా రెండు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఏదులాపురంలో 32 వార్డులకు కాంగ్రెస్​ తరపున 82 మంది నామినేషన్లు వేశారు. 25 వార్డుల్లో ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో, మిగిలిన వాళ్లు తప్పుకోవాల్సి ఉంటుంది. 

మిగిలిన వార్డుల్లో ఎవరిని తప్పిస్తారు, ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రెబల్స్​ ను తప్పించడం కూడా నేతలకు పెద్ద టాస్క్​ గా మారింది. మధిరలో చైర్ పర్సన్ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. చైర్ పర్సన్ అభ్యర్థిని ఏ పార్టీ కూడా ప్రకటించకపోవడంతో ఆయా పార్టీల్లోని కమ్మ, రెడ్డి, వైశ్య సామాజిక వర్గానికి చెందిన పలువురు పోటీ పడుతున్నారు. 

కాంగ్రెస్ లో కమ్మ సామాజికవర్గానికి చెందిన కొంతమంది తమవారికే చైర్​ పర్సన్ దక్కాలని హైకమాండ్​పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు నడుస్తోంది. పార్టీ ఇంచార్జ్ ఇష్టారాజ్యంగా అభ్యర్థులను నామినేషన్ లకు ప్రోత్సహించారని మరొక వర్గం ఆరోపిస్తూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 

కల్లూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ల్లో అంతర్గతంగా వర్గ పోరు నడుస్తోంది. ఢీ అంటే ఢీ అంటూ పలు వార్డుల్లో అత్యధికంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇటీవల పోటీకి ఆసక్తి చూస్తున్న వారి పేర్లపై కాంగ్రెస్ పార్టీ మూడు వేర్వేరు సర్వేలు చేయించింది. దీంతో కొన్ని వార్డులలో రీ సర్వే చేయాలంటూ నాయకులు ముందు కొందరు హడావుడి చేశారు.

 సర్వేలో ప్రథమ స్థానంలో వచ్చిన అభ్యర్థులు ఆర్థిక బలం లేకపోయినా ప్రజాబలంతో ముందడుగు వేయగా, సర్వేలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న వాళ్లు తమకు ఆర్థిక బలం ఉందంటూ టికెట్ల కోసం పైరవీలు  చేస్తున్నారు. ప్రధానంగా రెండవ వార్డులో 11 మంది, 19వ వార్డులో 13 మంది, మరో ఏడు వార్డుల్లో 9 మంది చొప్పున నామినేషన్లు వేశారు. వైరా, సత్తుపల్లిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 60 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు.  

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 106 మున్సిపల్ వార్డులకు గానూ ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ నుంచి 382, బీఆర్ఎస్ నుంచి 328 నామినేషన్లు దాఖలు కావడంతో అభ్యర్థుల ఎంపిక అధిష్టానాలకు తలనొప్పిగా మారింది. కొత్తగూడెం కార్పొరేషన్‌‌లో 60 డివిజన్లకు గానూ కాంగ్రెస్ నుంచి 237, బీఆర్ఎస్ నుంచి 167 మంది పోటీ పడుతుండగా, సీపీఐ ఏకంగా 109 నామినేషన్లు వేసింది. 

టికెట్ తమకే వస్తుందన్న ఆశతో నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆశావహులకు, బీఫామ్​ ఎవరిని వరిస్తుందోనన్న గుబులు పట్టుకుంది. మరోవైపు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి నడిచిన కాంగ్రెస్, సీపీఐల మధ్య మున్సిపల్ పొత్తులు ఇప్పుడు ఉండేలా కనిపించడం లేదు.  సీట్ల సర్దుబాటుపై ఐదారు రోజులుగా సాగుతున్న చర్చలు ఎటూ తేలకపోవడంతో ఇరు పార్టీల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. 

కొత్తగూడెం కార్పొరేషన్‌‌లో సీపీఐకి 20 స్థానాలతో పాటు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ మొగ్గు చూపగా, కనీసం 24 డివిజన్లు కావాలని సీపీఐ పట్టుబట్టడం చిక్కుముడిగా మారింది. ఈ క్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా రెండు డివిజన్ల నుంచి నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. పొత్తు కుదరకపోతే ఒంటరిగానే అన్ని చోట్లా పోటీ చేయాలని కార్యకర్తలు భావిస్తున్నారు.  

టికెట్ల కేటాయింపు ముగిసిన తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు 'రెబల్స్' సెగ తప్పేలా లేదు. ఒకే వార్డు నుంచి ముగ్గురు నలుగురు ముఖ్య నేతలు నామినేషన్లు వేయడంతో, బీ-ఫారం దక్కని వారు స్వతంత్రులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఈ తిరుగుబాటు ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఒకవేళ చివరి నిమిషంలో కాంగ్రెస్-సీపీఐ మధ్య పొత్తు కుదిరినా, సీట్లు వదులుకోవాల్సి వచ్చే వార్డుల్లో స్థానిక నాయకత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలు గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.