- బీజేపీ క్యాడర్‌కు పార్టీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ సూచన
- మున్సిపల్ ఫలితాలపై అసంతృప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేయాలని బీజేపీ క్యాడర్ కు ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కమలం పార్టీ సాధించిన ఫలితాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.
దీనిలో తెలంగాణ సహా ఏపీ, కర్నాటక, లక్షద్వీప్ తదితర రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సంతోష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ నిర్మాణానికి సంబంధించిన పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆరా తీశారు. ప్రచారం బాగానే చేసినా ఫలితాలు సరిగా రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం క్యాన్సిల్ అయింది. కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్, బీజేపీ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శివ ప్రకాష్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు వీవీఎన్ మాధవ్, బీజేపీ దక్షిణాది రాష్ట్రాల మహా ప్రశిక్షణ అభియాన్ ఇంచార్జ్ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంస్థాగత చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
