ఏపీకి నాలుగు సైనిక్​ స్కూళ్లిచ్చి.. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వరా? : వినోద్​ కుమార్​

ఏపీకి నాలుగు సైనిక్​ స్కూళ్లిచ్చి.. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వరా? : వినోద్​ కుమార్​
  • ఏపీలో తెలంగాణ రిజర్వేషన్లు ఎత్తేశారు: వినోద్​ కుమార్​

హైదరాబాద్, వెలుగు: ఏపీలో నాలుగు సైనిక్​ స్కూళ్లిచ్చి.. తెలంగాణకు ఒక్క సైనిక్​ స్కూల్​నూ కేంద్రం ఇవ్వకపోవడం దారుణమని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ​నేత బి. వినోద్ కుమార్​మండిపడ్డారు. ఏపీలోని కోరుకొండ, పులివెందుల, కలికిరిలలో సైనిక్​ స్కూల్స్​ ఉన్నాయని, ఇప్పుడు విజయవాడకు మరొకటి మంజూరు చేశారని చెప్పారు. వరంగల్​కు సైనిక్​ స్కూల్​ను మంజూరు చేసినా కేంద్రం ఎన్నో షరతులు పెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే సైనిక్​ స్కూల్​కు ఖర్చులన్నీ భరించాలని గతంలో చెప్పారని..దానిపై అప్పటి సీఎం కేసీఆర్​నిరసన తెలిపారని గుర్తుచేశారు.

బుధవారం వినోద్ కుమార్​ తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సైనిక్​ స్కూల్​ ఇవ్వకపోగా.. ఏపీలోని సైనిక్​ స్కూళ్లలో తెలంగాణకు ఉన్న రిజర్వేషన్​ కోటాను ఎత్తేశారని మండిపడ్డారు. ఏపీ సైనిక్​ స్కూళ్లలో ఏపీ, తెలంగాణలకు కలిపి 67 శాతం రిజర్వేషన్లుండేవని, కానీ, ఇప్పుడు తెలంగాణకు రిజర్వేషన్లు ఎత్తేసి కేవలం ఏపీకే 67 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా రేవంత్​ బాధ్యతలు చేపట్టాక.. తాను సైనిక్​ స్కూల్​ గురించి లేఖ రాస్తే హేళన చేస్తూ మాట్లాడారన్నారు.