యూట్యూబర్‌‌పై ‘బాబా కా ధాబా’ ఓనర్ ఫిర్యాదు

యూట్యూబర్‌‌పై ‘బాబా కా ధాబా’ ఓనర్ ఫిర్యాదు

న్యూఢిల్లీ: ఓవర్‌‌నైట్‌‌లో ఫేమ్ అయిన ‘బాబా కా ధాబా’ ఓనర్ 80 ఏళ్ల కంతా ప్రసాద్ గురించి వినే ఉంటారు. ఢిల్లీలోని ఓ చిన్నపాటి ధాబా ఓనరైన ఈ పెద్దాయన లాక్‌‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాడు. తమ షాపు నడవడం కష్టంగా ఉందంటూ ప్రసాద్ ఆయన భార్య కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను గౌరవ్ వాసన్ అనే యూట్యూబర్ నెట్‌‌లో షేర్ చేశాడు. దీనికి చాలా మంది నెటిజన్స్‌‌తోపాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించారు. బాబా కా ధాబాకు వెళ్లి భోజనం చేయాలని రణ్‌‌దీప్ హుడా లాంటి ప్రముఖ హిందీ నటుడు నెటిజన్స్‌‌ను కోరాడు. దీంతో తర్వాత రోజు నుంచి ఈ ధాబాకు విపరీతంగా కస్టమర్లు వచ్చారు.

ఈ విషయాన్ని పక్కనబెడితే.. యూట్యూబర్ గౌరవ్ వాసన్ తనను మోసం చేశాడంటూ బాబా కా ధాబా ఓనర్ కంతా ప్రసాద్ కేసు వేశారు. తమ వీడియోలను సోషల్ మీడియా కమ్యూనిటీ నుంచి డొనేషన్లు పొందడానికి గౌరవ్ వాసన్ వాడుకున్నాడని కంతా ప్రసాద్ ఆరోపించారు. ఫండ్స్ కోసం కంతా ప్రసాద్‌‌ దంపతులకు తెలియకుండా సోషల్ మీడియాలో తన కుటుంబీకులు, స్నేహితుల బ్యాంక్ అకౌంట్లను  షేర్ చేశాడని వాసన్‌‌పై అభియోగాలు వస్తున్నాయి. ఈ అంశంపై పోలీసులు స్పందించారు. ‘మాళవీయ నగర్ పోలీస్ స్టేషన్‌‌లో ఆదివారం మాకు ఫిర్యాదు అందింది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఎఫ్ఐఆర్ ఇంకా రిజిస్టర్ కాలేదు’ అని సౌత్ ఢిల్లీ డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ పేర్కొన్నారు.