ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా ఏ కాలంలోనైనా సాధారణంగా సమస్యలు ఉంటూనే ఉంటాయి. అవి ప్రజల విద్య, వైద్యరంగాల వెనుకబాటుతనానికి సంబంధించినవో, ఆర్థిక రంగంలోనో మరో రంగంలోనో ఉంటాయి. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే ఇలాంటి ఏ సమస్యలైనా అనతికాలంలోనే సమసిపోతాయి. కానీ, భారతదేశం దగ్గరకు వచ్చేసరికి ఈ సమస్యలన్నింటినీ తలదన్నే అతిపెద్ద సమస్య ఉంది. అదే కులసమస్య. ఈ ఒక్క సమస్య మన దేశంలోని మిగిలిన అన్ని సమస్యలకు కారణమైంది.
కుల సమస్య దేశంలోని మనుషులను ఎక్కడికక్కడ విభజించి వారి మధ్య ఐక్యత లేకుండా చేస్తోంది. ఈ కారణంగా ఇప్పటికే దేశం ఎంతగా నష్టపోవాలో అంతగా నష్టపోయింది. ముఖ్యంగా నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో కింద వర్గాల ప్రజలు ఎక్కువగా నష్టపోయారు. ఎందుకంటే మహాత్మా జ్యోతి రావు ఫూలే చెప్పినట్లు ‘కులవ్యవస్థ ఒక దోపిడీ వ్యవస్థ’. దుర్మార్గమైన ఈ కులవ్యవస్థను అంబేద్కర్ అర్థం చేసుకున్నంత లోతుగా ఈ దేశంలో మరొకరెవరూ అర్థం చేసుకోలేకపోయారు. అంబేద్కర్ కులసమస్యను ఎలా అధిగమించవచ్చో ఆయన పరిశోధనాత్మక రచన ‘కుల నిర్మూలన’లో తెలిపారు.
సామాజిక సమానత్వమే రిజర్వేషన్ల ఆశయం
అంబేద్కర్ పూర్తి స్పష్టతతో కులాన్ని, దాని చరిత్రను అర్థం చేసుకున్నాడు. కాబట్టి, ఆ కులరక్కసి దాష్టీకానికి తరతరాలుగా బలైపోయిన ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశాడు. చాలామంది అపోహపడుతున్నట్లు రిజర్వేషన్లు ఆర్థిక పురోభివృద్ధిని మాత్రమే లక్ష్యం చేసుకొని ఏర్పాటైనవి కాదు. సామాజిక సమానత్వం సాధించటమనే మహత్తర లక్ష్య సాధనకు ఇవి పుట్టాయి. అణచివేతకు గురైన బీసీల కోసం రాజ్యాంగంలో 340 ఆర్టికల్ని పొందుపరిచాడు అంబేద్కర్. దీని ద్వారా వీరికి కూడా రిజర్వేషన్లు కల్పించాలన్నది అంబేద్కర్ సంకల్పం.
ఈ నేపథ్యంలోనే బీసీలకోసం ప్రత్యేక కమిషన్ వేసి వారి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్నది ఈ ఆర్థికల్. అంబేద్కర్ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ పొందుపరిచి ఉండకపోతే బీసీలకు ఇప్పుడున్న ఇరవై యేడు శాతం రిజర్వేషన్లు దక్కి ఉండేవేకావు. ఈ విషయం తెలియక కొంతమంది బీసీలు అంబేడ్కర్ బీసీలకు ఏం చేయలేదని భ్రమపడుతుంటారు. ఇదే సందర్భంలో అంబేద్కర్ను కేవలం ఎస్సీల నాయకుడని అగ్రవర్ణ నాయకులు దుష్ప్రచారం చేస్తుంటారు. ఈ రకమైన వాదనలు ముందుకు రావటానికి ఎస్సీ నాయకులలోని కొందరి నిర్వాకం కూడా ఒక కారణమైంది. వాళ్లు మిగిలిన ప్రజలందరికీ, అంబేద్కర్కి మధ్య గోడ కట్టారు. ఆ గోడ మీద అంబేద్కర్ మా నాయకుడు అని రాసుకున్నారు. నిజానికి రిజర్వేషన్లు ముందుగా అనుభవించటం వల్ల వచ్చిన చైతన్యంతో అంబేద్కర్ అందరివాడు అని సమాజం మొత్తాన్ని అంబేద్కర్ మార్గంలోకి నడిపించాల్సిన బాధ్యత ఈ నాయకగణం మీదున్నది.
రాజ్యాంగం అందరిది...అంబేద్కర్ అందరివాడు
రాజ్యాంగాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్నవాళ్లయినా, కనీసం ఆయన రచనలు చదివినవాళ్లయినా అంబేద్కర్ను ఏ ఒక్క కులానికో అంటగట్టే ప్రయత్నం చేయరు. ఈ దేశ రాజ్యాంగం అందరిది అయినప్పుడు దానిని రాసిన అంబేద్కర్ అందరివాడు కాకుండా పోతాడా?. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అగ్రవర్ణ పేదల కోసమని చెప్పి పదిశాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. దానికి సంబంధించిన వెసులుబాటు రాజ్యాంగంలో ఉండబట్టే ఆ రిజర్వేషన్లకు చట్టబద్ధత చేకూరింది. దీన్నిబట్టి చూసినా అంబేద్కర్ అందరివాడన్న సంగతి స్పష్టమవుతుంది. అసలు చాలామంది గమనించని విషయం ఏమిటంటే ఎస్సీలందరూ అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్సీలుగా లేరు. అదేవిధంగా బీసీ కులవృత్తుల్లో ఉన్నవాళ్లు అన్ని రాష్ట్రాల్లోనూ బీసీలు కారు.
ఓసీలు కూడా అంతే. ఒక రాష్ట్రంలో ఒక కులం ఎస్సీగా ఉంటే అదే కులం మరో రాష్ట్ర పరిధిలో బీసీలుగా ఉన్నారు. ఒక రాష్ట్రంలో ఓసీగా ఉన్న కులం మరోరాష్ట్రంలో బీసీలుగానో, ఎస్సీలుగానో ఉన్నారు (బ్రాహ్మణులలో ఈ మార్పులుండవు. వారు ఎక్కడ ఉన్నా ఉన్నతవర్గాలే). ఆయా రాష్ట్రాల, ఆయా కులాల సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ఏ కేటగిరీ కిందకు వస్తారో నిర్ణయించుకునే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చాడు అంబేద్కర్. ఇది దేశంలోని పరిస్థితులన్నీ ఒకేరీతిగా ఉండవని భావించి అందరికి సమన్యాయం జరగాలనే ఉన్నతాశయంతో ఆయన చేసిన ఏర్పాటు.
రాజ్యాంగం ద్వారా కేవలం రిజర్వేషన్లే కాదు..
రాజ్యాంగం ద్వారా ఆయన కేవలం రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చాడని భావిస్తే అది చాలా సంకుచిత దృష్టి అవుతుంది. రాజ్యాంగం అమలులోకి రాకముందు ఈ దేశంలోని మనుషులంతా సమానం కాదు. కొందరికి చదువుకునే హక్కులేదు. కనీసం ప్రకృతి ప్రసాదించిన వనరులను కూడా సమానంగా వాడుకునే హక్కులు లేవు. మహిళల విషయంలో అసలు హక్కుల ప్రస్తావనే ఉండదు. శూద్రులు, అతి శూద్రుల పేరిట తొంభై శాతానికి పైగా ఉన్న ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా భరింపరాని పీడనకు గురయ్యేవారు. ఈ దేశంలో మనుషులంతా సమానం కాకపోవటానికి గల కారణాలేమిటో అన్వేషించాడు అంబేద్కర్. ఈ క్రమంలోనే భారతదేశంలో కులానికీ, మతానికి మధ్యగల సంబంధాన్ని హేతుబద్ధంగా వివరించాడు.
దేశానికి ప్రమాదకారిగా ఉన్న కులవ్యవస్థతో ఒకవైపు భౌతిక పోరాటాలు కొనసాగిస్తూనే మరోవైపు ఆ వ్యవస్థను సమర్థిస్తున్న మతసాహిత్యం మీద పరిశోధన చేసి దాని నిజస్వరూపం బట్టబయలు చేశాడు. అంబేద్కర్ విస్తృత పరిశోధనల ఫలితంగా మనకు అమూల్యమైన గ్రంథాలు లభించాయి. ఈ దేశంలోని బీసీ చరిత్ర గురించి పరిశోధించి అంబేద్కర్ రాసిన పుస్తకం ‘శూద్రులెవరు?’ ఇది చదివితే దేశంలో సగానికి పైగా ఉన్న బీసీలు శూద్రులుగా ఎందుకు అణచివేతకు గురయ్యారో అర్థం అవుతుంది. దళితులు అస్పృశ్యులుగా ఎందుకిన్ని బాధలు పడవలసి వచ్చిందో, ఆ కుట్రల వ్యూహకర్తలెవరో ‘అస్పృశ్యులెవరు’ అన్న గ్రంథంలో వివరించాడు. బడుగు బలహీన వర్గాలకు చెందిన చరిత్రను శాస్త్రీయంగా పూర్తి ఆధారాలతో అంబేద్కర్ బయటపెట్టాడు.
విశ్వమేధావి అంబేద్కర్
దేశప్రజల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ తన మేధాశక్తిని దేశం కోసం ధారపోశాడు అంబేద్కర్. అందుకే ఆయనను ప్రపంచ దేశాలు విశ్వమేధావిగా గుర్తించాయి. అంతటి మేధాసంపత్తి గలవాడు కాబట్టే ప్రపంచంలోనే అత్యున్నతమైన భారత రాజ్యాంగాన్ని రాయగలిగాడు. అయితే కులవ్యవస్థ ద్వారా తరతరాలుగా నష్టపోయిన ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందటంతో వాళ్ల జీవితాలు మెరుగయ్యాయి. కానీ కుల వ్యవస్థ మాత్రం నాశనం కాలేదు. కొత్తకొత్త రూపాల్లో అది నేటికీ బుసలుకొడుతున్న పరిస్థితి మనకళ్ల ముందే కనిపిస్తుంది.
దానికి ప్రధానమైన కారణం మనం అంబేద్కర్ని కేవలం రాజ్యాంగానికి మాత్రమే పరిమితం చేసి ఆయన జీవితకాలమంతా ధారపోసి పరిశోధించి రాసిన రచనలను విస్మరించటమే. అంబేద్కర్ రచనలు చదివి ఆ సారాన్ని జీర్ణించుకుని ఆయన చూపిన బాటలో నడిస్తే తప్ప కుల సమస్యను మనం అధిగమించలేం. అడ్డుకోలేం. నిరంకుశమైన కులవ్యవస్థ పోతే తప్ప ఈ దేశంలో మనుషులంతా సమానస్థాయిలో బతకలేరు.
- తోకల రాజేశం
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమేపంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.

