ఘనంగా జగ్జీవన్రామ్ జయంతి..వేడుకల్లో పాల్గొన్న మంత్రులు, నేతలు

ఘనంగా జగ్జీవన్రామ్ జయంతి..వేడుకల్లో పాల్గొన్న మంత్రులు, నేతలు
  •  
  • జగ్జీవన్​ రామ్​ స్ఫూర్తిగా దళిత యువత ఎదగాలి: మంత్రి వివేక్​
  • జీవితాంతం దళిత హక్కుల కోసం పోరాడిన మహనీయుడని వెల్లడి
  • 30 కోట్లతో జగ్జీవన్ ​రామ్ ​భవన్​నిర్మిస్తం: మంత్రి అడ్లూరి 
  • జగ్జీవన్​రామ్ గొప్ప రాజనీతిజ్ఞుడు: మాజీ గవర్నర్ దత్తాత్రేయ

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్​రామ్​ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ బషీర్‌‌‌‌బాగ్ చౌరస్తాలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి.. మంత్రులు, నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మంత్రులు వివేక్​వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్, మాజీ గవర్నర్​ బండారు దత్తాత్రేయ,​ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్, కేఆర్​నాగరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. దళితులకు 18 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. కాంట్రాక్టులు సహా అన్ని అంశాల్లో వారికి 18 శాతం అవకాశాలు కల్పించాలని అన్నారు. దళిత హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ ను స్ఫూర్తిగా తీసుకొని దళిత యువత ఎదగాలని పిలుపునిచ్చారు. జగ్జీవన్ రామ్  దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రజాసేవలో కొనసాగిన నాయకుడని కొనియాడారు.

100 కోట్లతో 10 అంతస్తుల అంబేద్కర్ ​టవర్

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ జయంతిని కేవలం స్మరణ దినంగా కాకుండా దళిత ఆత్మగౌరవ ఉద్యమానికి ప్రేరణగా మలచాలని అన్నారు. కాచిగూడలో రూ.30 కోట్లతో జగ్జీవన్ రామ్ భవన్ నిర్మాణం, హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ నిర్మాణాలకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో రూ.100 కోట్లతో 10 అంతస్తుల అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అలాగే నింబోలి అడ్డా హాస్టల్‌‌‌‌కు ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. దళితుల ఓట్లు కాదు.. దళితుల గౌరవమే ముఖ్యమని కాంగ్రెస్ నమ్ముతుందన్నారు.

ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు: దత్తాత్రేయ

హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ గొప్ప రాజనీతిజ్ఞుడని, తన నమ్మిన సిద్ధాంతాల కోసం నిరంతరం కృషి చేసిన సాధారణ ప్రజానాయకుడని అభివర్ణించారు. దళిత వర్గాల నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగి దేశానికి సేవలందించిన ఆయన త్యాగాలు తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. మాల, మాదిగ నాయకులు ఒకే వేదికపైకి రావడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ప్రొఫెసర్ కాసిం, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మందకృష్ణ మాదిగ, జేబీ రాజు, మేడి పాపయ్య, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు.