గంగానదిలో చెక్కపెట్టెలో కొట్టుకొచ్చిన చిన్నారి

గంగానదిలో చెక్కపెట్టెలో కొట్టుకొచ్చిన చిన్నారి

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ దగ్గర గంగానదిలో చంటిబిడ్డ కొట్టుకువచ్చిన సంచలన  ఘటన బుధవారం జరిగింది. గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తుండటంతో పడవ నడిపే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. చుట్టూ చూశాడు. ఎక్కడా చంటిబిడ్డ జాడలేదు. కానీ ఏడుపులు మాత్రం వినిపిస్తున్నాయి. దీంతో తీవ్రంగా పరిశీలించి చూడగా.. నదిలో ఓ చెక్కపెట్టె కొట్టుకువస్తుండటం చూశాడు. ఆ పెట్టెనుంచే చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తున్నాయని తెలుసుకున్నాడు. నదిలోంచి ఆ పెట్టెను ఒడ్డుకు తీసుకొచ్చి తెరిచి చూడగా.. అందులో ఓ చంటిబిడ్డ కన్పించింది.

చెక్కపెట్టెలో ఓ ఎర్రని వస్త్రం పై ఆడబిడ్డను పడుకోబెట్టి..అమ్మవారి దేవతా పఠాన్ని కూడా పెట్టి ఉంది. ఆ బిడ్డ వయస్సు నెలరోజుల లోపు ఉంటుందని అంచనా. పడవ నడిపే వ్యక్తి కేకలు విన్న పలువురు స్థానికులు అక్కడి చేరుకున్నారు. ఆ పెట్టెలో ఉన్న బిడ్డను చూసి ఆశ్చర్యపోయారు. ఆ పెట్టెలో కనకదుర్గమ్మ వారి ఫొటోతో పాటు ఓ పేపర్ కూడా ఉంది. ఆ పేపర్‌లో ఆ బిడ్డ పుట్టిన జాతకం ప్రకారం..ఆ బిడ్డకు 'గంగ' అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది.

పెట్టెలో దొరికిన ఆడబిడ్డను గుర్తించిన నావికుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ బిడ్డను నాకు గంగమ్మే ఇచ్చిందని.. ఇది తన అదృష్టం అని మురిసిపోయాడు. ఈ బిడ్డను పెంచుకుంటానని చెప్పాడు. అయితే నిరాకరించిన పోలీసులు సంఘటన పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు. బిడ్డను స్వాధీనం చేసుకుని.. ఆశాజ్యోతి కేర్ సెంటర్‌కు తరలించారు.

మరోవైపు ఈఘటనపై స్పందించిన  యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్  పాప బాధ్యతను  పూర్తిగా తీసుకుంటామని  ప్రకటించినట్టు IANS వార్తా సంస్థ ట్వీట్‌ చేసింది.

మొత్తంగా చెక్కపెట్టెలో చిన్నారి గంగానదిలో కొట్టుకురావడంపై స్థానికులు..భారతంలోని కర్ణుడి కథను గుర్తుకు తెచ్చుకున్నారు.