V6 News

Parenting: శిశువుల పెంపకం.. చంటి పిల్లలకు ఆహారం ఇలాగే పెట్టాలి..!

 Parenting:  శిశువుల పెంపకం.. చంటి పిల్లలకు ఆహారం ఇలాగే పెట్టాలి..!

పసిపిల్లలకు పెట్టే ఆహారం సరైంది కాకపోతే చిన్నారి ఆరోగ్యానికే ఇబ్బంది. అందుకే వారికి ఏడాది నిండేవరకు ఎప్పుడు ఎలాంటి ఆహారం అందివ్వాలో  ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

తల్లిపాలు ఎంత అవసరం

పసిపిల్లలు తల్లిపాలు ఎంత తాగితే అంత తాగించడం మంచిది. ఒకవేళ తల్లిపాలు అందకపోతే వారికి పాల పొడులు ఉత్తమం. గేదె, ఆవు పాలలో ప్రొటీన్, ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. నిజానికి వీరికి ప్రొటీన్ మరీ అంత అవసరం ఉండదు. పైగా కొందరు శిశువులకి ప్రొటీన్ అలర్జీ ఉండొచ్చు. జీర్ణవ్యవస్థ సమస్య లు రావచ్చు. అందుకే ఏడాది నిండేవరకు గేదె, ఆవు పాలు పట్టకపోవడం మంచిది.

నీళ్లు ఎప్పట్నుంచి

తల్లిపాలు తాగే పిల్లలకు ఆరు నెలల వరకూ నీళ్ళు తాగించాల్సిన అవసరం లేదు. పోత పాలు తాగే పిల్లలకు కాచి చల్లార్చిన నీళ్లు మధ్య మధ్యలో ఇస్తూనే ఉండాలి. ఏడో నెల నుంచైతే ఏ చిన్నారులకైనా పప్పులు, కూరగాయలు ఉడికించిన నీళ్లు తాగించడం అలవాటు చేయాలి. వాటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని తప్పనిసరిగా తాగించాలి.

ఇతర ఆహార పదార్థాలు

ఆరు నెలల తరవాత ఘన పదార్థాలను ఇవ్వడం మొదలు పెట్టాలి. బియ్యం జావ మొదట అలవాటు చేయాలి. అది తేలిగ్గా అరుగుతుంది. ఇది ఎంత పల్చగా ఉంటే అంత మంచిది. దీంతోపాటు పసిపిల్లలకు రాగులు కూడా చాలా మంచివి. వీటిని మొలకలు కట్టించి కాస్త వేయించి పొడి చేయాలి. దీన్నిజావలా చేసి అందివ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల ఆకలి పెంచే ఏఆర్ఎస్ అనే ఎంజైము విడుదలవుతుంది. అలానే చిన్నారులకు ఏ చిరుధాన్యాలు పెట్టినా ఇలానే మొలకలు కట్టించి ఇవ్వాలి. అన్నీ ఒకేసారి కాకుండా ఒకదాని తరువాత మరొకటి పెంచుకుంటే మంచిది. అలానే ఎనిమిదో నెల నుంచీ పొట్టుతీసి సన్నగా తురిమిన బంగాళాదుంప, క్యారెట్ వంటివి కూడా ఈ జావలో కలిపిపెట్టొచ్చు.

అన్నం ఎప్పుడు

మొదట్లో పావు కప్పు పెడితే సరిపోతుంది. పప్పు కూడా కలిపి పెట్టినా ఫర్వాలేదు. ఆరు గంటలకోసారి అన్నంతో చేసిన ఏ పదార్థం తినిపించినా ఫర్వాలేదు. సాయంత్రం ఏడు గంటలు దాటాక మాత్రం చిన్నారులకు అన్నం పెట్టకూడదు. అంత త్వరగా అరగ కపోవచ్చు.

పోషకాహారం గురించి

ఏడో నెల నుంచి పండు కూడా అలవాటు చేయొచ్చు. బాగా పండిన అరటి, సపోట, బొప్పాయి మంచివి. తొమ్మిదో నెల రాగానే ఉడికించిన గుడ్డులోని పసుపు సొన పెట్టాలి. మొదట రెండు చెంచాలు తినిపించి పడుతుందో లేదో ఓ రెండుమూడు రోజులు గమనించాలి. పన్నెండు నెలలు నిండాక పూర్తిగా గుడ్డు తినిపించొచ్చు. పది నెలలు వచ్చాక ఆకుకూరల్ని సన్నగా తరిగి ఉడికించిన అన్నంతో కలిపి పెట్టాలి. ఇలా చేయడం వల్ల విటమిన్లు, పోషకాల లోపం అధిగమించడం సాధ్యమవుతుంది. ఏడు నెలల నుంచి క్రమంగా ఉప్పు, కారం, పులుపు అలవాటు చేయాలి.

కొన్ని ప్రత్యేక శ్రద్ధలు

పిల్లలు బరువు క్రమ పద్ధతిలో పెరుగుతున్నారా లేదా అనే విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. అతి బరువు, అతి తక్కువ బరువుతో గనుక పిల్లలు పెరుగుతుంటే ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. 

పిల్లలు చురుకుగా ఆడుతు న్నారా లేదా? వాళ్లకి బాగా ఆకలి వేస్తోందా లేదా? రోజు విరేచనం సాఫీగా ఉంటోందా.. లేదా? అనే విషయాలు గమనిస్తుండాలి. ఆకలి వేస్తుందీ లేనిది వారు తీసుకునే ఆహార క్రమాన్ని బట్టి అర్థమవుతుంది. జలుబు, దగ్గు లాంటి చిన్న సమస్యలు తరచుగా వస్తుంటే వారిలో మెటబాలిజం తక్కువగా ఉన్నట్టు. అంటే ప్రొటీన్, విటమిన్స్, మినరల్స్ లాంటి రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారా న్ని అందించాలి.

–వెలుగు,లైఫ్​–