అత్యంత సంపన్నుల్లో...15 స్థానానికి చేరిన అదానీ

అత్యంత సంపన్నుల్లో...15 స్థానానికి చేరిన అదానీ
  •     ఆసియాలో రెండో అత్యంత సంపన్నుడు
  •     మొదటి స్థానంలో ముకేశ్​ అంబానీ
  •     వెల్లడించిన బ్లూమ్‌‌‌‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్

న్యూఢిల్లీ :  అదానీ గ్రూపు చైర్మన్​, బిలియనీర్ గౌతమ్ అదానీ డిసెంబర్ 6 నాటికి బ్లూమ్‌‌‌‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ (బీబీఐ)లో 15వ స్థానానికి చేరుకున్నారు. భారతదేశం,  ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముకేశ్‌అంబానీకి కాస్త దూరంలో ఉన్నారు. 82.5 బిలియన్ డాలర్ల (6.8 లక్షల కోట్లు) నెట్​వర్త్​ తో ఈయన ఇప్పుడు ప్రపంచంలోని 15వ అత్యంత సంపన్నుడు. ఆసియాలోనే రెండో అత్యంత సంపన్న భారతీయుడు. అదానీ ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 38 బిలియన్ డాలర్లను కోల్పోయారు. - ఈ నష్టంలో ఎక్కువ భాగం హిండెన్‌‌‌‌బర్గ్ ఆరోపణల వల్ల వచ్చింది. ఈ ఏడాది జనవరిలో  న్యూయార్క్‌‌‌‌కు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌‌‌‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్‌‌‌‌ స్టాక్ మానిప్యులేషన్,  అకౌంటింగ్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించింది. 

ఈ వాదనలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. ఈ ఆరోపణల తర్వాత, అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోవడంతో అదానీ వ్యక్తిగత సంపద దాదాపు 60 శాతం క్షీణించి 69 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అదానీ గ్రూపు ఎఫ్​ఎంసీజీ మొదలుకొని విమానాశ్రయాల వరకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. దేశంలోనే  అతిపెద్ద ప్రైవేట్ ఓడరేవు ఈ సంస్థకు ఉంది.   గ్రూప్‌‌‌‌లోని ఫ్లాగ్‌‌‌‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్, మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 17 బిలియన్ డాలర్లు సంపాదించింది.  

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అంబానీ 91.4 బిలియన్ డాలర్ల (7.6 లక్షల కోట్లు) సంపదతో బీబీఐలో 13వ స్థానంలో ఉన్నారు. చివరి మార్పు (ర్యాంక్​) నుంచి ఆయన 1.01 బిలియన్ డాలర్లు సంపాదించారు. ఈ ఏడాది ఆయన సంపద 4.33 బిలియన్ డాలర్లు పెరిగింది. బీబీఐలో టాప్ – 50లో ఉన్న భారతీయులలో షాపూర్ మిస్త్రీ 32.8 బిలియన్ డాలర్లుతో 41వ స్థానంలో,  శివ్ నాడార్ 30.7 బిలియన్ డాలర్లతో 45వ స్థానంలో ఉన్నారు.