జమ్మలమడక పిచ్చయ్య కన్నుమూత

జమ్మలమడక పిచ్చయ్య  కన్నుమూత

వరంగల్  జిల్లా : తొలి తరం బాల్  బాడ్మింటన్  క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహిత జమ్మలమడక పిచ్చయ్య కన్నుమూశారు. ఈ నెల 21న 104 వ బర్త్ డే జరుపుకున్న పిచ్చయ్య .. ఆదివారం మధ్యాహ్నం అస్వస్థతతో చనిపోయారు. వరంగల్  జిల్లా దేశాయిపేటకు చెందిన పిచ్చయ్య బాల్  బాడ్మింటన్ లో అంచెలంచెలుగా రాణించి జాతీయ స్థాయికి ఎదిగారు. తన ఆటతో దేశానికి పేరు తీసుకొచ్చారు. ఈ క్రీడలో మొదటి అర్జున అవార్డు అందుకుని తర్వాతి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. 

1918 డిసెంబరు 21న కృష్జా జిల్లాలోని కూచిపుడి గ్రామంలో పున్నయ్య, నాగమ్మ దంపతులకు జన్మించారు పిచ్చయ్య. ఆయన తండ్రి మచిలీపట్నంలో స్థిరపడడంతో బందరులో ఎస్ ఎస్ ఎల్ సీ పూర్తిచేశారు. పదో తరగతి ఫెయిల్ కావడంతో ఇంట్లో  ఖాళీగా ఉండలేక బందరు పట్టణంలోని మినర్వ క్లబ్ , మోహన్  క్లబ్ లో బాల్ బ్యాడ్మింటన్  ఆడడం అలవాటు చేసుకున్నారు. అప్పట్లో ఈ ఆటను సంపన్నవర్గాల వారే ఆడేవారు. అయినా ఎలాగైనా నేర్చుకోవాలని పట్టుదలతో ముందుకుసాగారు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించారు. ఆటలో తనకంటూ ప్రత్యేకమైన గురువు, శిక్షణ లేకపోయినా ఏకలవ్యుడిలా సాధనచేసి ఆటపై పట్టు సాధించారు. ఆయన ఆట తీరును చూసిన కొన్ని ప్రైవేటు క్లబ్ ల నిర్వాహకులు తమ తరుఫున ఆడాలని ప్రోత్సహించేవారు.