బఖ్​ముత్.. మా మనసుల్లోనే ఉంది : వ్లాదిమిర్ జెలెన్​స్కీ

బఖ్​ముత్.. మా మనసుల్లోనే ఉంది : వ్లాదిమిర్ జెలెన్​స్కీ

ఉక్రెయిన్: రష్యా ఆర్మీ సపోర్ట్​తో వాగ్నర్ ప్రైవేటు సైన్యం బఖ్‌‌ముత్​ను నాశనం చేసిందని, అక్కడ ఏం మిగల్చలేదని ఉక్రెయిన్​ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్​స్కీ మండిపడ్డారు. ప్రస్తుతానికి బఖ్‌‌ముత్‌‌ తమ మనసుల్లో మాత్రమే ఉందని వివరించారు. ఉక్రెయిన్​లోని కీలక నగరమైన బఖ్​ముత్​ను స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటించడంపై జెలెన్​స్కీ తీవ్రంగా స్పందించారు. జపాన్​లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 సమిట్​కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో కలిసి పాల్గొన్న జెలెన్ స్కీ ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘బఖ్‌‌ముత్​లో ఏం మిగల్లేదు. వాగ్నర్ ప్రైవేట్ ఆర్మీ బఖముత్​ను నేలమట్టం చేసింది. ఇప్పుడు అక్కడ ఏంలేదు” అని జెలెన్​స్కీ అన్నారు.

ఉక్రెయిన్​కు రూ.31 వేల కోట్ల సాయం

ఉక్రెయిన్​కు జో బైడెన్ తాజాగా రూ.31,089 కోట్ల సాయం ప్రకటించారు. మందుగుడు సామగ్రి, ఆయుధాలతో పాటు వెహికల్స్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ క్రమంలోనే జెలెన్​ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది నెలలుగా రష్యా ఆర్మీ, వాగ్నర్​ ప్రైవేటు సైన్యంతో ఉక్రెయిన్​ ఆర్మీ వీరోచితంగా పోరాడిందని అన్నారు. బఖ్​ముత్​ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా చాలా కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు.  

రష్యా ఆర్మీ, వాగ్నర్ సైన్యానికి పుతిన్ అభినందన.

బఖ్​ముత్​ను స్వాధీనం చేసుకోవడంపై రష్యా ఆర్మీ, వాగ్నర్ ప్రైవేట్ సైన్యాన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అభినందించారు. 8 నెలల పాటు సాగిన పోరు తర్వాత బఖ్‌‌ముత్‌‌ నగరాన్ని స్వాధీనం చేసుకోడంపై పుతిన్ హర్షం వ్యక్తంచేశారు. శనివారం మధ్యాహ్నమే సిటీ మొత్తం తమ అధీనంలోకి వచ్చిందని వెల్లడించారు. రష్యా ఆర్మీకి వాగ్నర్​ ప్రైవేట్ సైన్యం ఎంతో సహకారం అందించిందన్నారు.