సిటీలో ట్రాఫిక్​కు చెక్.. బల్దియా నయా ప్లాన్​!

సిటీలో ట్రాఫిక్​కు చెక్.. బల్దియా నయా ప్లాన్​!
  • ఎస్ఆర్డీపీ సెకండ్ ఫేజ్​లో భాగంగా మెయిన్​ జంక్షన్లలో రోడ్​ అండర్​ బ్రిడ్జిలు
  • రూ.1230 కోట్లతో  17 ప్రాజెక్టులు
  • త్వరలో టెండర్లు వేయనున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: ఎస్ఆర్డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్) సెకండ్ ఫేజ్​లో భాగంగా  గ్రేటర్​లో మరో 17 ప్రాజెక్టులు చేపట్టేందుకు బల్దియా ప్లాన్​సిద్ధం చేసింది.  సికింద్రాబాద్​, ఖైరతాబాద్​, చార్మినార్​ జోన్లలో ట్రాఫిక్​ ఎక్కువగా ఉన్న ప్రధాన జంక్షన్ల వద్ద  అండర్ బ్రిడ్జిలతో పాటు రోడ్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనుంది. రూ.1230 కోట్లతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు.  ప్రభుత్వం నుంచి ఇందుకు అనుమతులు తీసుకొని టెండర్ల ప్రాసెస్ ను పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు రెడీ అవుతున్నారు. అండర్ బ్రిడ్జిల నిర్మాణంపైనే బల్దియా ఎక్కువగా ఫోకస్ పెట్టింది.  తక్కువ ఖర్చుతో ట్రాఫిక్​ సమస్య తీరుతుండటంతో వీలైనంత వరకు అండర్ బ్రిడ్జిలను నిర్మించాలని భావిస్తున్నారు. ఎస్ఆర్డీపీ ఫస్ట్ ఫేజ్​లో భాగంగా ఇప్పటివరకు 20 ప్రాజెక్టులు అందుబాటులోకి రాగా..ఇందులో 8 ప్రాంతాల్లో అండర్ పాస్ నిర్మాణాలే ఉన్నాయి. ప్రస్తుతం సెకండ్​ఫేజ్ లోనూ 15 అండర్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. అండర్​ బ్రిడ్జి సాధ్యం కాకపోతేనే రోడ్ ఓవర్​ బ్రిడ్జి నిర్మించేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చాలా చోట్ల ట్రాఫిక్​ సమస్య తీరుతుందని అధికారులు చెప్తున్నారు.  రోడ్ అండర్ బ్రిడ్జిల నిర్మాణంతోపాటు రోడ్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని బల్దియా అధికారులు నిర్ణయించారు.  సికింద్రాబాద్ జోన్ పరిధిలో  రూ.635కోట్లతో 10 ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నారు.  కూకట్ పల్లి జోన్ పరిధిలో  రూ.250 కోట్లతో 3,  చార్మినార్ జోన్ లో రూ.195 కోట్లతో 2, ఖైరతాబాద్ జోన్ పరిధిలో రూ.150 కోట్లతో రెండు ప్రాంతాల్లో ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.  ఇలా మొత్తం 17 ప్రాజెక్టులకోసం రూ.1230 కోట్లు ఖర్చు చేయనున్నారు.  సికింద్రాబాద్ ​జోన్​కి సంబంధించి10 ప్రాజెక్టుల్లో ఎక్కువ పనులు రైల్వే ఏరియాల్లోనే ఉన్నాయి. దీంతో  రైల్వే, బల్దియా అధికారులు  సమన్వయంతో పనిచేస్తే మరింత తొందరగా ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి.

పాత ప్రాజెక్టులు పూర్తి కాకుండానే..
ఎస్ఆర్టీపీలో భాగంగా మొత్తం 23వేల 500కోట్లతో ప్రధాన జంక్షన్ల వద్ద డెవలప్ మెంట్ పనులు జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్​లో 20 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కొన్ని పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్​లో పెండింగ్ పనులను పక్కన పెట్టి ప్రస్తుతం సెకండ్ ఫేజ్​లో భాగంగా 17 ప్రాజెక్టుల పనులను ప్రారంభించేందుకు బల్దియా సిద్ధమైంది. వీటితో పాటు మరికొన్ని పనులను సెకండ్ ఫేజ్​లో చేపట్టనున్నట్లు తెలుస్తోంది.  సెకండ్ ఫేజ్​లోని పనులతో పాటు పాత వాటిపై కూడా ఫోకస్ పెట్టి వాటిని తొందరగా పూర్తి చేయాలని సిటిజన్లు కోరుతున్నారు. 

ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు
సికింద్రాబాద్​ జోన్​లో మౌలాలి, మల్కాజిగిరి, సఫిల్​గూడ, కాకతీయనగర్​, వినాయక నగర్​, మౌలాలి స్టేషన్​, చిలకలగూడ, మాణికేశ్వరనగర్​లో అండర్​ పాస్​లు,  మెట్టుగూడ, పాటిగడ్డ  ప్రాంతాల్లో రోడ్​ఓవర్​ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. కూకట్​పల్లి జోన్ పరిధిలో బొల్లారం నుంచి గుండ్లపోచంపల్లి మధ్యలో, సుచిత్ర నుంచి ఓల్డ్​ అల్వాల్​, వెంకటాపురం నుంచి ఓల్డ్​ అల్వాల్​ మధ్యలో అండర్​ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. చార్మినార్​ జోన్​లో ఫలక్​నుమా, బుద్వేల్​, ఆరాంఘర్​ వద్ద రోడ్ అండర్​ బ్రిడ్జిలను నిర్మించ నున్నారు. ఖైరతాబాద్​ జోన్ ​పరిధి రాజ్​భవన్​, ఖైరతాబాద్​లో అండర్ ​పాస్​ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు.