హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నెల 21న బల్దియా స్టాండింగ్ కమిటీ, 25న కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుత కౌన్సిల్ కు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు మాత్రమే గడువు ఉంది. ఆ తరువాత మేయర్, డిప్యూటీ మేయర్ సహా కార్పొరేటర్లంతా మాజీలు కానున్నారు. చివరి రోజుల్లో డివిజన్లు అభివృద్ధి చేసుకోవాలని కార్పొరేటర్లు ఆసక్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న జనరల్ బాడీ సమావేశం కీలకం కానుంది.
ఈ ఐదేళ్లలో చేసిన పనులు, జరగాల్సిన పనులపై సుదీర్ఘంగా చర్చించాలని కార్పొరేటర్లు మేయర్ ను కోరుతున్నారు. స్టాండింగ్ కమిటీ ముందుకు 2026–-27 వార్షిక బడ్జెట్ కు సంబంధించి ప్రతిపాదనలు రానున్నాయి. బడ్జెట్ కు స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నెల 25న జనరల్ బాడీ సమావేశాన్ని గందరగోళం లేకుండా నిర్వహించాలని చూస్తున్నారు.
