రైలు పట్టాలు కోసెయ్యండి.. సింగరేణి భవన్ను కాల్చేయండి: పార్టీ క్యాడర్, సింగరేణి కార్మికులను రెచ్చగొట్టిన బాల్క సుమన్

రైలు పట్టాలు కోసెయ్యండి.. సింగరేణి భవన్ను కాల్చేయండి: పార్టీ క్యాడర్, సింగరేణి కార్మికులను రెచ్చగొట్టిన బాల్క సుమన్
  • అప్పుడే పార్టీకి, నాయకత్వానికి  మైలేజీ వస్తదని కామెంట్లు
  • జనం మనవైపు చూడాలంటే మీటింగులు పెట్టుడు కాదు
  • మిలిటెంట్​ ఉద్యమాలు చేయాలన్న బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే 
  • తెలంగాణ​ భవన్​లో టీబీజీకేఎస్ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాష్ట్రంలో భారీ విధ్వంసాలకు పాల్పడాలంటూ ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాలకు రైతులు వస్తలేరని, జనాన్ని ఆకట్టుకోవాలంటే మిలిటెంట్ తరహా ఉద్యమాలు చెయ్యాలంటూ క్యాడర్​ హింసవైపు మళ్లేలా వ్యాఖ్యలు చేశారు. సింగరేణి జీఎం ఆఫీసును తగలబెట్టాలని, అవసరమైతే సింగరేణి భవన్​ను కాల్చెయ్యాలని,  రైలు పట్టాలు కోసెయ్యాలని, అప్పుడే తమ సంఘానికి, తమ పార్టీకి, తమ లీడర్లకు మైలేజ్​ వస్తుందని చెప్పారు.

హైదరాబాద్​లోని తెలంగాణ​భవన్​లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్​ అనుబంధ టీబీజీకేఎస్​(తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) రాష్ట్ర వర్కింగ్​ కమిటీ సమావేశంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వేదికపై హరీశ్​రావు, ఇతర పార్టీ ముఖ్య నేతలు ఉండడం గమనార్హం.

బాల్క సుమన్​ మాట్లాడుతూ “మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే రైతులు రోడ్ల మీదికి వస్తలేరు. నిన్న మా భీమారంలో నేషనల్​ హైవే దిగ్బంధించిన్రు.. ఐదుగురే రైతులు వచ్చిన్రు.. 60,70 మంది మనోళ్లే(బీఆర్ఎస్). నిన్న చెన్నూర్​లో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారిపై కూర్చున్నం.. నలుగురైదుగురే రైతులు వచ్చిన్రు.. మళ్ల మనోళ్లే 100 మంది ఉన్నరు.. మీటింగులు, సోషల్​మీడియా, ప్రెస్​మీట్లు కాదు.. మిలిటెంట్​ యాక్టివిటీ చేయాలే.. మందమర్రిలో ఓ ప్రోగ్రామ్​ పెట్టున్రి.. జీఎంగాని ఆఫీసు తగలవెడ్దాం.. మా అయితే ఓ నెలరోజులు జైలుకుపోయొద్దాం.. అవసరమైతే సింగరేణి భవన్​ను ​కాలవెట్టున్రి.. అంగడంగడి జేయున్రి.. ఆ ఫీలింగ్​ రావాలె.. మన సంఘానికి, మన  పార్టీకి, మన నాయకత్వానికి ఓనర్​షిప్​(మైలేజ్) రావాలే’’ అని రెచ్చగొట్టారు.

‘మన ఏరియాల గన్ని రైల్వే లైన్లున్నయ్.. రైలురోకో పేరుచెప్పి పట్టాలు కోసిపడేయిన్రి.. మహా అయితే 45 రోజులు జైలుకు పోతారేమో.. పొయ్యి రాన్రి.. జైలుకు పొయ్యేస్తే అదో మెడల్ లెక్క ఉంటది.. సీరియస్​గా చెప్తున్నా.. పని చేస్తే పైసలు తన్నుకుంట వస్తయ్.. ఒక్కటి కాలవెట్టి చూడు ఎట్ల రావో పైసలు?’ అంటూ సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులను సుమన్​ రెచ్చగొట్టారు.

ప్రజలు, రైతులు పార్టీకి మద్దతివ్వట్లేదు కాబట్టి రాష్ట్రంలో విధ్వంసాలకు ప్లాన్ చేయాలని సుమన్ స్వయంగా చెప్పడం సంచలనంగా మారింది. కేసీఆర్ దత్తపుత్రుడిగా, కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సుమన్ విధ్వంసాలకు పిలుపునివ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్​టాపిక్​లా మారింది.