నా మాటలు వక్రీకరించారు..కార్మికులు, రైతుల అక్రోశం గురించే నేను మాట్లాడిన: బాల్క సుమన్

నా మాటలు వక్రీకరించారు..కార్మికులు, రైతుల అక్రోశం గురించే నేను మాట్లాడిన: బాల్క సుమన్
  • నాపై కేసులు పెడతామంటే పెట్టుకోండి
  • కేసులు పెట్టాల్సి వస్తే ముందు సీఎంపైనే పెట్టాలని కామెంట్

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తానేమీ రెచ్చగొట్టే కామెంట్స్ చెయ్యలేదని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. తాను కార్మికులు, రైతుల ఆక్రోశం, ఆవేదన గురించి మాట్లాడానని, కానీ తాను మాట్లాడిన అంశాలపై కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని విమర్శించారు.  ‘ఫార్మా కంపెనీని కాలుస్తా అన్న జడ్చర్ల ఎమ్మెల్యే పై కేసు పెట్టారా.. నరుకుతా అన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాగూర్ పై కేసులు పెట్టారా?’ అంటూ నిలదీశారు.

నిజంగా కేసులు పెట్టాలంటే సీఎంతో సహా అందరిపై కేసులు పెట్టాలన్నారు. బుధవారం ఆయన తెలంగాణభవన్ లో మీడియాతో మాట్లాడారు. “ప్రగతి భవన్ ను బాంబులు పెట్టి పేల్చాలని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎవరైనా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని మక్కన్ సింగ్ ఠాకూర్ అన్నారు.

సింగరేణి ఏరియాకు, రైతుల కొనుగోలు కేంద్రానికి వెళ్దామా పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం పట్ల ఏ వర్గం సంతృప్తిగా లేదు. నాపైన పెట్టే శ్రద్ధ రైతులపై పెట్టండి. శ్రీలంకలో, బంగ్లాదేశ్ లో ప్రజలు తిరగబడినట్లు తెలంగాణలోనూ ప్రజల తిరుగుబాటు వస్తుంది” అని చెప్పారు. తనపై కేసు పెడితే పెట్టుకోండంటూ సవాల్ చేశారు. సీఎం కార్యాలయం డైరెక్షన్ మేరకు తనను ట్రోల్ చేస్తున్నారని చెప్పారు