ఈశాన్య రాష్ట్రాలు అపారమైన ప్రకృతి సంపదకు, విశిష్టమైన సంప్రదాయ హస్తకళలకు నిలయం. ముఖ్యంగా అస్సాం, మేఘాలయ లాంటి ప్రాంతాల్లో వెదురుతో తయారుచేసే వస్తువులు స్థానిక గిరిజన, గ్రామీణ ప్రజల జీవన విధానంలో భాగమయ్యాయి. తరతరాలుగా వస్తున్న ఆ అద్భుతమైన హస్తకళా నైపుణ్యాన్ని గ్లోబల్ ట్రెండ్స్‌కు అనుగుణంగా మలిచి, లగ్జరీ మార్కెట్‌కు పరిచయం చేసింది వర్షా బజాజ్. ఆమె స్థాపించిన స్టార్టప్ ‘క్యాన్‌బూ క్రాఫ్ట్’ నుంచి పర్యావరణ అనుకూల ఫర్నిచర్‌ని అమ్మడంతోపాటు ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారు.
వర్షా బజాజ్ అస్సాంలోని గువహటిలో పుట్టి, పెరిగింది. అక్కడే హందిక్ గర్ల్స్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత పెండ్లి చేసుకుని మేఘాలయకు వెళ్లింది. ఒక సాధారణ మధ్యతరగతి గృహిణిగా ఆమె జీవితం ప్రశాంతంగా సాగుతోంది. అదే టైంలో అనుకోకుండా భర్త చనిపోయాడు. ఆమెకు ఏం చేయాలో తోచలేదు. భవిష్యత్తు శూన్యంగా కనిపించింది.
వర్షాకు అప్పటివరకు ఉద్యోగం చేసిన అనుభవం కూడా లేదు. అప్పటికే ఆమె కూతురు బెంగళూరులో గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. దాంతో వర్షా కూడా అక్కడికే వెళ్లి ఏదైనా ఉద్యోగం వెతుక్కోవాలి అనుకుంది. మానసిక వేదన నుంచి బయటపడటానికి, తన కాళ్ల మీద తాను నిలబడటానికి అప్పట్లో బాగా ట్రెండ్‌లో ఉన్న ‘డిజిటల్ మార్కెటింగ్’ కోర్సులో చేరింది.
కోర్సు పూర్తైన తర్వాత కార్పొరేట్ ఉద్యోగం సాధించింది. కంపెనీలు మారుతూ కొన్నాళ్లపాటు జాబ్ చేసినా ఏదో తెలియని వెలితి. జీతం కోసం గంటల తరబడి ఆఫీస్‌లో కూర్చుని పని చేయడం ఆమెకు నచ్చలేదు. సమాజానికి ఉపయోగపడేలా, తన ప్రాంతానికి గుర్తింపుని తీసుకొచ్చేలా ఏదైనా చేయాలని ఆలోచించడం మొదలుపెట్టింది.
వెదురుతో..
కొన్నాళ్లకు ఉద్యోగం వదిలేసి తను పుట్టిన ఊరు గువహటికి వెళ్లిపోయింది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతోమంది బ్యాంబూ కళాకారులు ఉన్నారు. వాళ్లంతా పనులు లేక ఇబ్బందులు పడడం చూసింది. ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు ప్రతి ప్రాంతంలో వెదురు, కేన్ (కర్రలను అల్లే మెత్తని తీగ)తో అద్భుతమైన వస్తువులు తయారు చేస్తుంటారు. కానీ, వాటిని అమ్ముకునేందుకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేవు.
దానికి తోడు కొవిడ్–19 ప్యాండమిక్ వల్ల ఇ–కామర్స్ ట్రెండ్ పెరిగింది. ఈ సాంకేతిక మార్పును అందుకోలేక స్థానిక కళాకారులు నష్టపోయి, కూలీ పనుల కోసం వలస వెళ్లేవాళ్లు. ఇదంతా గమనించిన వర్షా వాళ్ల టాలెంట్‌ని డిజిటల్ ప్రపంచానికి పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. ఆ లక్ష్యంతోనే 2021లో గువహటి కేంద్రంగా ‘క్యాన్‌బూ క్రాఫ్ట్’ని ఏర్పాటు చేసింది.
ఈ బ్రాండ్ ద్వారా కేవలం సాధారణ బుట్టలు, చాపలే కాకుండా మోడ్రన్ ఇంటీరియర్‌కు సరిపోయే లగ్జరీ ఫర్నిచర్‌ను తయారుచేయించి అమ్ముతోంది. కాఫీ టేబుల్స్, ల్యాంప్‌షేడ్స్, సోఫా సెట్లు, ఉయ్యాలలు, బెడ్‌రూమ్ హెడ్‌బోర్డ్‌లు, బోహేమియన్ స్టైల్ ఇంటీరియర్ వస్తువులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పర్యావరణానికి హాని కలిగించని ఈ బయోడీగ్రేడబుల్ ఫర్నిచర్‌ని ‘బయోఫిలిక్’ డిజైన్‌లో తయారుచేస్తున్నారు. బయోఫిలిక్ అంటే ఇళ్లు, పరిసరాలను ప్రకృతికి దగ్గరగా ఉండేటట్టు తీర్చిదిద్దే ఒక నిర్మాణ శైలి.
లగ్జరీ రిసార్ట్‌ల్లో
వర్షా ఎన్నో సవాళ్లను అధిగమించి చివరకు ఈ బ్రాండ్‌ని నిలబెట్టింది. క్యాన్‌బూ క్రాఫ్ట్ ఇప్పుడు ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లోని పెద్ద పెద్ద థీమ్ కెఫేలు, లగ్జరీ రిసార్ట్‌ల ఇంటీరియర్ ప్రాజెక్టులకు బ్యాంబూ ఫర్నిచర్ సప్లై చేస్తోంది. ఈ బ్రాండ్ నుంచి ఉత్పత్తి అవుతున్న హోం ఇంటీరియర్ ప్రొడక్ట్స్‌కి కూడా ప్రత్యేక డిమాండ్ ఉంది.
వ్యాపారంలో లాభాలు సాధించడంతోపాటు సామాజిక మార్పు తీసుకురావడంలోనూ వర్షా బజాజ్ తనవంతు కృషి చేస్తోంది. అంతరించిపోతున్న సంప్రదాయ కళకు జీవం పోస్తూ, ఎంతోమంది గ్రామీణ కళాకారులకు, ముఖ్యంగా మహిళలకు ఉపాధిని కల్పిస్తోంది.
నమ్మకం కలిగించి..
ఈశాన్య భారతదేశం లాంటి సౌకర్యాలు సరిగ్గా లేని ప్రాంతంలో స్టార్టప్‌ని ప్రారంభించడం అంత సులభమైన పని కాదు. అందుకే వర్షాతన ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
కళాకారులకు మొదట్లో ఆన్‌లైన్ వ్యాపారాల పట్ల అపనమ్మకం ఉండేది. అప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాకారులను కలిసి, వాళ్లకు స్థిరమైన ఆదాయం వస్తుందని నమ్మకం కలిగించి, మళ్లీ వెదురు అల్లికల వైపు తీసుకురావడానికి వర్షాచాలా శ్రమించాల్సి వచ్చింది.
వెదురుతో చేసిన వస్తువులు త్వరగా పాడైపోతాయి. చెదలు పడతాయి. అందుకే చాలామంది వీటికి దూరంగా ఉంటారు. ఈ నాణ్యతా లోపాన్ని సరిచేయడానికి క్యాన్‌బూ క్రాఫ్ట్ అంతర్జాతీయ ప్రమాణాలను పాటించింది. ముడి వెదురును నేరుగా వాడకుండా, దానిని ‘నేచురల్ సాల్ట్ ట్రీట్‌మెంట్’ ద్వారా ప్రాసెస్ చేస్తున్నారు. దీనివల్ల వస్తువుల మన్నిక పెరిగింది. ఆ తర్వాత కస్టమర్లలో నమ్మకం ఏర్పడింది.
ఈనాటి ఇ-కామర్స్ యుగంలో కస్టమర్లు తాము ఆర్డర్ చేసిన వస్తువు 2-3 రోజుల్లో డెలివరీ కావాలని కోరుకుంటారు. కానీ, క్యాన్‌బూ క్రాఫ్ట్ ఉత్పత్తులను పూర్తిగా చేతితో అల్లుతారు. ఒక ఆర్డర్ పూర్తవడానికి, సరుకు రవాణా కావడానికి కనీసం 3 నుంచి 4 వారాల సమయం పడుతుంది. ఈ ‘ఆలస్యం’ వెనుక ఉన్న శ్రమను, కారణాలను కస్టమర్లకు చెప్పి ఒప్పించడం వర్షాకు ఒక నిరంతర సవాలుగా మారింది.
భారీ పరిమాణంలో ఉండే సోఫాలు, కుర్చీలను ఈశాన్య రాష్ట్రాల నుంచి దేశంలోని ఇతర సుదూర మెట్రో నగరాలకు ఎటువంటి డ్యామేజ్ లేకుండా సురక్షితంగా షిప్పింగ్ చేయాలి. అది చాలా పెద్ద టాస్క్. దాన్ని కూడా ఆమె సమర్థవంతంగా పూర్తి చేస్తోంది.
