చెన్నై: టిక్ టాక్.. కొద్ది రోజుల్లోనే యువతలో భారీ క్రేజ్ సంపాదించుకున్న యాప్. దీనిలో రకరకాల వీడియోలు చేయడం ఒక ట్రెండ్ లా మారిపోయింది. కానీ ఈ ట్రెండ్ చాలా ప్రమాదకరమని తమిళనాడు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో చర్చించారు. టిక్ టాక్ వల్ల తమిళ సంస్కృతే కాక శాంతిభద్రతలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఐటీ మంత్రి ఎం.మణికందన్ అన్నారు. అసభ్యకర డాన్సులు, ఫోర్నోగ్రఫికి టిక్ టాక్ వేదికగా నిలిచిందని, దీంతో యువత తప్పుదోవ పడుతున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని నిర్ణయించామన్నారు. దీన్ని ఆమోదించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు.
ఇటీవల తమిళనాడులోని సేలం జిల్లా కలెక్టర్ రోహిణి పర్సనల్ ఫోటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా పాటలతో యాడ్ చేసి టిక్‌టాక్ యాప్‌లో పోస్టు చేశారు. ఆమెతోపాటు ఆమె కుమారుడి ఫోటోలను కూడా వివిధ రకాల సోషల్ మీడియా నెట్ వర్క్ లలో షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సైబర్‌క్రైం పోలీసులు ఈ ఫోటోలను తొలగించే పనిలో పడ్డారు.
