ODI World Cup 2023: వేదిక మార్చేది లేదు.. దగ్గుతూ తుమ్ముతూ ఆడాల్సిందే!: స్పష్టం చేసిన బీసీసీఐ

ODI World Cup 2023: వేదిక మార్చేది లేదు.. దగ్గుతూ తుమ్ముతూ ఆడాల్సిందే!: స్పష్టం చేసిన బీసీసీఐ

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడోరోజు శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 540గా నమోదయ్యింది. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లకు రెండ్రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల రాకపోకల్ని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో సోమవారం(నవంబర్ 6) అరుణ్ జైట్లీ వేదికగా జరగనున్న బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్‌ను మరొకచోటికి తరలించనున్నారని వార్తలు రాగా.. బీసీసీఐ వాటిని ఖండించింది.

ఈ వార్తల నేపథ్యంలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ యధాతధంగా జరుగుతుందని.. మ్యాచ్‌ను ఢిల్లీ నుంచి మరొకచోటికి మార్చబోమని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టి పొగమంచు దట్టంగా కమ్ముకున్నా బీసీసీఐ ఎట్టి పరిస్థితులలో మ్యాచ్ నిర్వహించి తీరుతుందని స్పష్టమవుతోంది.

కాగా, విపరీతమైన కాలుష్యం నేపథ్యంలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ప్రాక్టీస్ లో పాల్గొనలేదు. ఆయా జట్ల వైద్యుల సలహా మేరకు ప్రాక్టీస్‌ను రద్దు చేసుకొని హోటల్ గదులకు పరిమితమయ్యాయి.

శ్రీలంక 7.. బంగ్లాదేశ్ 9

వరల్డ్ కప్ టోర్నీలో ఈ ఇరు జట్ల ఆటతీరు అంతంత మాత్రమే. ఇప్పటివరకూ రెండూ ఏడేసి మ్యాచ్‌లు ఆడగా, శ్రీలంక రెండింటిలో.. బంగ్లాదేశ్ ఒక దాంట్లో విజయం సాధించాయి. మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించి పరువు నిలబెట్టుకోవడం తప్ప సెమీస్ చేరే అవకాశాలు ఇరు జట్లకు లేవు.